‘నాటు నాటు’పై డ్యాన్స్ మాస్టర్ హర్టు?

నాటు నాటు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ పాట గురించి ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి అత్యద్భుత రీతిలో స్టెప్పులేసిన ఈ పాట.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో విజయం సాధించింది ఈ పాట. అలాగే ఆస్కార్ అవార్డులకు కూడా ఈ పాట నామినేట్ అయింది. అందులోనూ అవార్డును కొల్లగొట్టడం పక్కా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ పాటను ఆస్కార్ వేదిక మీద కీరవాణి పెర్ఫామ్ కూడా చేయబోతుండడం అవార్డు దక్కుతుందనడానికి ఒక సూచికగా భావిస్తున్నారు. ఈ పాటకు సంబంధించి కీరవాణి.. రాజమౌళి.. అలాగే హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గొప్ప పాపులారిటీనే దక్కింది. చివరికి గేయ రచయిత చంద్రబోస్ సైతం మీడియాలో హైలైట్ అయ్యారు.

కానీ ఈ పాటకు అద్భుత రీతిలో నృత్య రీతులు సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాత్రం ఎక్కడా సీన్లో లేడు. ‘ఆర్ఆర్ఆర్’ టీం అతడికి ఎక్కడా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. నిజానికి ‘నాటు నాటు’ ఎక్కువ ఆకట్టుకుంది శ్రవణ పరంగా కాదు. దృశ్యపరంగానే. తారక్, చరణ్ సూపర్ సింక్‌లో వేసిన స్టెప్పులే ఈ పాటకు ఆకర్షణ తెచ్చాయి. చూసేవారు అబ్బురపడేలా చేశాయి. ఆ పాటకు అంత మంచి స్టెప్పలు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్‌కు పాట విజయంలో మేజర్ క్రెడిట్ దక్కుతుంది.

ఐతే రాజమౌళికి ఇష్టమైన కొరియోగ్రాఫరే అయినప్పటికీ.. ఈ పాట గురించి మీడియాలో, అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడేటపుడు ప్రేమ్ రక్షిత్ గురించి ప్రస్తావించట్లేదు. తన వెంట ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు. ఈ విషయంలో ప్రేమ్ రక్షిత్ తన సన్నిహితులు, తాను పని చేసే వేరే చిత్రాల యూనిట్ సభ్యుల దగ్గర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాజమౌళిని విమర్శించేంత సాహసం చేయలేడు కానీ.. ఈ పాట విషయంలో తనకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదని అతను ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది.