డిజాస్టర్ ఎంట్రీ తర్వాత..

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబులతో పాటు అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా అరంగేట్రం చేశాడు. వీరి తర్వాతి తరం నుంచి ముందుగా కృష్ణ మనవడు గల్లా అశోక్ గత ఏడాది సంక్రాంతికి ‘హీరో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ చిత్రం ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది.

తొలి ప్రయత్నంలో గట్టి ఎదురు దెబ్బ తగలడంతో అశోక్.. రెండో సినిమా విషయంలో హడావుడి పడలేదు. జాగ్రత్తగా రెండో చిత్రాన్ని ఓకే చేశాడు. ఆ చిత్రం ఆదివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. విక్టరీ వెంకటేష్, బోయపాటి శ్రీను సహా చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇంతకుముందు కార్తికేయ హీరోగా ‘గుణ 369’ సినిమాను రూపొందించిన అర్జున్ జంధ్యాల.. అశోక్ రెండో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అ!, జార్జిరెడ్డి, హనుమాన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. ప్రశాంత్ కథలన్నీ కొంచెం కొత్తగా, క్రేజీగా ఉంటాయి. అశోక్ కోసం రెడీ చేసిన కథ కూడా అలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎన్నారై అయిన సోమినేని బాలకృష్ణ అనే కొత్త నిర్మాత లలితాంబిక క్రియేషన్స్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం అశోక్ సరికొత్త లుక్‌లోకి మారబోతున్నాడట. తొలి సినిమాలో అశోక్ పెర్ఫామెన్స్ ఓకే అనిపించినా.. అతడి లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈసారి అతడి లుక్ సహా అన్నీ మారాల్సిందే.