ట్రోల‌ర్ల‌కు త‌మ‌న్ స‌మాధానం

టాలీవుడ్ అనే కాదు.. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే త‌మ‌న్ ఎదుర్కొన్నంత సోష‌ల్ మీడియా నెగెటివిటీని మ‌రే సంగీత ద‌ర్శ‌కుడూ ఎదుర్కొని ఉండ‌డంటే అతిశ‌యోక్తి కాదు. ఒకే ర‌కం పాట‌లిస్తాడ‌ని.. కాపీ కొడ‌తాడ‌ని సోష‌ల్ మీడియా ఊపు పెర‌గ‌క‌ముందు నుంచే అత‌ను ట్రోలింగ్ ఎదుర్కొంటూ వ‌చ్చాడు.

ఒక ద‌శ‌లో అది బాగా శ్రుతిమించింది కూడా. ఐతే మ‌ధ్య‌లో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకుని మంచి మంచి ఆల్బ‌మ్స్ ఇవ్వ‌డం ద్వారా నెగెటివిటీని త‌గ్గించుకున్నాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. కానీ ఈ మ‌ధ్య త‌మ‌న్ మ్యూజిక్ మ‌ళ్లీ రొటీన్ అయిపోతున్న‌ట్లు అనిపిస్తోంది. దీంతో మ‌ళ్లీ ట్రోలింగ్ త‌ప్ప‌ట్లేదు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ అభిమానుల‌కు అత‌ను టార్గెట్‌గా మారిపోయాడు.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ చేయ‌బోయే కొత్త సినిమాకు త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ‌ద్దంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో గొడ‌వ గొడవ చేస్తున్నారు. గ‌త ఏడాది స‌ర్కారు వారి పాట సినిమాకు స‌రైన పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌లేద‌న్న‌ది వారి ఆరోప‌ణ‌. పైగా మ‌హేష్ కొత్త సినిమా కోసం త‌మ‌న్ రెడీ చేసిన ట్యూన్ల‌ను త్రివిక్ర‌మ్ తిర‌స్క‌రించాడంటూ ఒక రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

దీంతో త‌మ‌న్‌ను ఈ సినిమా నుంచి త‌ప్పించాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ రోజంతా ట్రెండ్ చేస్తున్నారు మ‌హేష్ ఫ్యాన్స్. ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు ల‌క్ష‌ల్లోకి వెళ్లిపోయాయి. ట్విట్ట‌ర్లో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మ‌న్ ఇదంతా గ‌మ‌నించ‌కుండా ఏమీ లేడు.

త‌న గురించి పాజిటివ్‌గా ఉన్న ట్వీట్ల‌ను లైక్ చేయ‌డ‌మే కాక‌.. ఎందుకింత నెగెటివిటీ అంటూ ఒక చిన్న పోస్టు పెట్టాడు. నెగెటివిటీకి స‌మాధానంగా ఇదే త‌న క్రియేటివిటీ అంటూ ట్రోల‌ర్ల‌కు స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా స‌రే మ‌హేష్ ఫ్యాన్స్ అయితే త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.