నాగ్ పల్లెటూరి డ్రామా

ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి కొత్త టాలెంట్ ను ప్రోత్సాహిస్తూ వస్తున్న నాగార్జున తాజాగా రైటర్ ప్రసన్న కుమార్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా ఆఫీషియాలగా ఎనౌన్స్ అవ్వలేదు కానీ సినిమాకు సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఒక పక్క స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తూనే మరో వైపు లొకేషన్స్ వేటలో పడ్డాడు ప్రసన్న. సంక్రాంతి సీజన్ లో కోనసీమ ప్రాంతం అంతా చుట్టి వచ్చాడు. కారణం షూటింగ్ అక్కడే. నాగార్జున తో పక్కా విలేజ్ ఫ్యామిలీ డ్రామా తీయబోతున్నాడు.

మలయాళంలో జోజు జార్జ్ నటించిన ‘మరియమ్ పొరింజు జోస్’ అనే సినిమాకు రీమేక్ గా నాగ్ సినిమా తెరకెక్కబోతుంది. మూల కథతో పాటు కొన్ని సన్నివేశాలు తీసుకొని ప్రసన్న తన స్టైల్ లో కొన్ని మార్పులు చేస్తున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా కామెడీ సీన్స్ యాడ్ చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ అలాగే మరో యంగ్ హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. బహుశా ప్రసన్న రైటర్ గా పనిచేసిన హీరోల్లో ఎవరో ఒకరు ఆ రోల్ చేసే ఛాన్స్ ఉంది.

నాగార్జున విలేజ్ డ్రామాలతో చాలా హిట్స్ కొట్టాడు. ఆ మధ్య ‘సోగ్గాడు చిన్ని నాయన’ , రీసెంట్ గా ‘బంగార్రాజు’ సినిమాలు నాగ్ కి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అదే స్టైల్ లో ఇప్పుడు ప్రసన్న సినిమా కూడా ఉండబోతుందని టాక్. కాకపోతే పంచేకట్టు లాంటివి ఉండకపోవచ్చు. నాగ్ ను మాత్రం కొత్తగా చూపించే ప్రయత్నంలో ఉన్నాడు రైటర్ కం డైరెక్టర్. ఘోస్ట్ తో నాగ్ మార్కెట్ బాగా దెబ్బతింది. దాని తర్వాత చేస్తున్న ఈ రీమేక్ విలేజ్ డ్రామాతో నాగ్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రసన్న టాలెంట్ తో నాగ్ హిట్ కొడితే మళ్ళీ మార్కెట్ ఊపందుకోవడం ఖాయం.