ఎన్ని డబుల్ ధమాకాలు బాబోయ్?

టాలీవుడ్‌కు ఒకప్పుడు సీక్వెల్స్, రెండు భాగాల సినిమాలు అస్సలు కలిసొచ్చేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వరుసబెట్టి సీక్వెల్స్ తీసేస్తున్నారు. అలాగే ఒక సినిమాగా మొదలుపెట్టి రెండు పార్ట్‌లు చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలు చేసి అద్భుత ఫలితం రాబట్టడంతో ఇక అందరూ అదే రకంగా ఆలోచిస్తున్నారు.

సుకుమార్ సైతం ‘పుష్ప’ను ఒక చిత్రంగా మొదలుపెట్టి.. మధ్యలో ఆలోచన మార్చుకున్నాడు. ఒకే కథను ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ అంటూ రెండు సినిమాలుగా మార్చేశాడు. ఈ ఆలోచన కూడా బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతున్న, తెరకెక్కబోయే పెద్ద సినిమాలు చాలా వాటి విషయంలో ఈ రెండు భాగాల ఆలోచనలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ మొదలైనపుడు దాన్ని ఒక పార్ట్‌గానే భావించారు. కానీ తర్వాత టీం ఆలోచన మారినట్లే కనిపిస్తోంది. ‘సలార్’ రెండు భాగాలుగా రావడం పక్కా అంటున్నారు. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. మరోవైపు ప్రభాస్ కొత్త సినిమాల్లో ఒకటైన ‘ప్రాజెక్ట్-కే’ కూడా 2 పార్టులుగా వస్తుందని తాజాగా ప్రచారం మొదలైంది. కానీ ఇది ఉత్త ప్రచారమే అని కూడా అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాను పూర్తి చేయడమే గగనంగా ఉంటే ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు 2 పార్టులుగా రాబోతున్నట్లు వార్తలొస్తుండడం విశేషం. బాగా ఆలస్యమవుతున్న ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా వస్తుందని తాజా సమాచారం. ఇప్పటిదాకా షూట్ చేసిన రష్ చాలా ఎక్కువగా ఉండడం.. ఇంకా తీయాల్సింది కూడా చాలానే ఉండడంతో సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తున్నారట. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో తాజాగా ప్రారంభోత్సవం జరుపుకున్న ‘ఓజీ’ సైతం రెండు భాగాల సినిమానే అంటున్నారు. ఐతే కథ డిమాండ్ చేసి రెండు భాగాలు తీస్తే, ప్రేక్షకులను కన్విన్స్ చేస్తే ఓకే కానీ.. ఆదాయం ఎక్కువ వస్తుందని అత్యాశకు పోయి అనవసరంగా కథలను సాగదీస్తే మాత్రం ‘యన్.టి.ఆర్’ సినిమాలా తేడా కొట్టడం ఖాయం.