ప్రభాస్-మైత్రీ.. ఇలా కన్ఫమ్ చేశారు

ప్రస్తుతం టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఉన్నంత ఊపులో మరే బేనర్ కూడా లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తున్న దిల్ రాజు సైతం ఈ సంస్థ ముందు కొంచెం వెనుకబడ్డారు. సినిమాల సంఖ్య, రేంజ్, సక్సెస్.. ఇలా ఏ రకంగా చూసుకున్నా మైత్రీ వాళ్లు ముందంజలో ఉన్నారు.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేసి రెంటినీ సక్సెస్ ఫుల్ చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న మైత్రీ సంస్థ.. ప్రస్తుతం ‘పుష్ప-2’ లాంటి మెగా మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను మైత్రీ సంస్థ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ సంస్థ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతోనూ సినిమాలు చేసింది. ఇక టాప్ స్టార్లలో మిగిలింది ఒక్క ప్రభాస్ మాత్రమే. అతడితోనూ తమ బేనర్లో సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు ఇంతకుముందే ప్రకటించారు.

ఐతే ఇటీవలే ఆ ప్రాజెక్టు ఓకే కూడా అయింది. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ అనౌన్స్‌ చేయకపోయినా.. తాము సెట్ చేసిన సినిమా గురించి చెప్పకనే చెప్పేసింది మైత్రీ సంస్థ. మైత్రీ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ముంబయికి వెళ్లి బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌ను కలిసి ‘పఠాన్’ సక్సెస్‌పై అభినందనలు తెలియజేశారు.

మైత్రీ సంస్థ సిద్దార్థ్ దర్శకత్వంలోనే ప్రభాస్ సినిమాను చేయబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అధి నిజం కాకపోతే ఇక్కడ్నుంచి ఆ సంస్థ అధినేత వెళ్లి సిద్దార్థ్‌ను ముంబయిలో అభినందించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రభాస్ హీరోగా సిద్దార్థ్ దర్శకత్వంలో మైత్రీ సినిమా ఖరారైపోయినట్లే.

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడని వార్తలొస్తున్నాయి. అదెంత వరకు నిజమో కానీ.. ‘పఠాన్’ తర్వాత సిద్దార్థ్.. హృతిక్‌తోనే ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌తో అతడి సినిమా వచ్చే ఏడాది పట్టటాలెక్కే అవకాశముంది.