బాలీవుడ్ కనివిని ఎరుగని సరికొత్త చరిత్ర షారుఖ్ ఖాన్ తన పఠాన్ తో లిఖించబోతున్నాడు. రోజుకో వంద కోట్లు కొల్లగొట్టనిదే థియేటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా సునామిలా విరుచుకుపడుతున్న బాద్షా దూకుడుకు ఇప్పుడప్పుడే బ్రేకులు పడేలా లేవు. వారం తిరక్కుండానే 650 కోట్ల గ్రాస్ దగ్గరగా వెళ్ళిపోయిన పఠాన్ ఫైనల్ రన్ అయ్యే లోపు వెయ్యి కోట్ల మైలురాయిని సులభంగా అందుకోనుంది. కనీసం నెల రోజుల స్ట్రాంగ్ రన్ విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ స్పీడ్ కు అడ్డుకట్ట వేస్తుందనుకున్న షెహజాదా ఫిబ్రవరి 10 నుంచి 17కి పోస్ట్ పోన్ కావడంతో రూట్ మరింత క్లియర్ అయ్యింది.
ఓవర్సీస్ లోనూ పఠాన్ విధ్వంసం మాములుగా లేదు. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 ఫుల్ రన్ లను జపాన్, చైనా రిలీజు లేకుండా ఈజీగా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నార్త్ లో అన్ని సెంటర్లలో ఇది తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్లు ఉండటం లేదు. పోటీగా వచ్చిన గాంధీ గాడ్సే ఏక్ యుద్ లాంటివి కనీసం సోదిలో లేకుండా పోయాయి. దీంతో పఠాన్ జోరుకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. 300 కోట్ల షేర్ ని అత్యంత వేగంగా సాధించిన మూవీగా మరో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. బాహుబలి 2 పదిరోజుల్లో ఈ ఫీట్ ని సాధిస్తే పఠాన్ కు కేవలం వారం సరిపోయింది. ఊచకోత ఆ రేంజ్ లో ఉంది.
మొత్తానికి షారుఖ్ అభిమానుల ఆకలి మాములుగా తీరలేదు. దద్దోజనం పెడితే గొప్పనుకున్న టైంలో ఏకంగా బావర్చి బిర్యానీ పెట్టడంతో వాళ్ళ ఆనందం గురించి వర్ణించడం కష్టమే. పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ గాల్లో తేలిపోతున్నాడు. వార్ లాగా హిట్టు కొడుతుందనుకున్నాడు కానీ కంటెంట్ లో లోపాలు అసలేమాత్రం కనిపించకుండా ఈ రేంజ్ లో కింగ్ ఖాన్ బ్యాటింగ్ చేయడం చూసి నెక్స్ట్ చేస్తున్న హృతిక్ రోషన్ ఫైటర్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఇది కూడా పఠాన్ లాగే అదే తేదీకి 2024 జనవరి 25 విడుదల కానుండటం విశేషం. సెంటిమెంట్ లా ఫిక్స్ అయ్యారు కాబోలు.