నితిన్‌తో వెంకీ ప్రయోగం?

యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. కెరీర్లో ఒక దశలో వరుసగా డజను ఫ్లాపుల దాకా ఎదుర్కొన్నాక ‘ఇష్క్’ దగ్గర్నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చిన నితిన్.. కొన్నేళ్ల నుంచి మళ్లీ తడబడుతున్నాడు. ‘భీష్మ’ను మినహాయిస్తే చాన్నాళ్ల నుంచి అతడికి సరైన విజయం లేదు.

ఆ సినిమాతో గాడిన పడ్డట్లే కనిపించిన అతను.. ఆ తర్వాత చెక్, రంగ్ దె, మాచర్ల నియోజకవర్గం చిత్రాలతో పతనం చవిచూశాడు. ‘మాచర్ల..’ అయితే మరీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం అతను వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ చేశాడు. దీని తర్వాతి సినిమా కూడా దాదాపు ఖరారైనట్లే. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ మళ్లీ జట్టు కడుతున్నేట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

నిజానికి వెంకీ తన తర్వాతి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం హోల్డ్‌లో పడిపోయింది. అది ఒక వేళ తిరిగి పట్టాలెక్కే అవకాశమున్నా ఇప్పట్లో అయితే కాదు. కాబట్టి నితిన్‌తో ఓకే అయిన ప్రాజెక్టునే పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు వెంకీ. ఐతే ఈసారి నితిన్‌తో అతను ఒక ప్రయోగాత్మక కథను ప్రయత్నించనున్నట్లు సమాచారం.
ఒక అరుదైన వ్యాధి వల్ల నెల రోజుల్లో తాను చనిపోబోతున్నానని తెలిసిన కుర్రాడు… ఆ నెల రోజుల కాలాన్ని ఎలా గడిపాడు, రాబోయే తన మరణం గురించి తెలిసి జనాలు అతడితో ఎలా వ్యవహరించారు.. చివరికి అతడి జీవితానికి దక్కిన ముగింపేంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. కథ లైన్ వింటే విషాదభరితంగా అనిపించినా.. ట్రీట్మెంట్ వెంకీ స్టయిల్లో సరదాగా ఉంటుందని.. నితిన్ కెరీర్లో ఇదొక వైవిధ్యమైన సినిమా అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.