నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు నందమూరి అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయన మృత్యువుతో పోరాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తారకరత్న కోలుకుంటున్న సంకేతాలు ఇటు వైద్యులు కానీ.. అటు తెలుగుదేశం వర్గాలు కానీ ఇవ్వట్లేదు.
‘యువగళం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లోకేష్‌తో కలిసి పాదయాత్రలో నడుస్తూ ఉన్నట్లుండి స్పృహతప్పిన తారకరత్నను ముందుగా కుప్పంలోని ఒక ఆసుపత్రికి తరలించడం.. ముందు తనకు వచ్చింది గుండెపోటు అని తెలియక తారకరత్న లైట్ తీసుకోవడం.. ఆ తర్వాత పరిస్థితి విషమమించడం తెలిసిందే. ముందే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకుని తారకరత్నను బెంగళూరుకు తరలించి చికిత్స అందించి ఉంటే ముప్పు తప్పేదని.. అత్యవసర చికిత్సలో ఆలస్యం జరగడం వల్ల ఇప్పుడు పరిస్థితి విషమించిందని అంటున్నారు.
ప్రస్తుతం వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం.. తారకరత్నకు రక్త పోటు అధికమై.. అంతర్గతంగా రక్తస్రావం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుండెలో వాల్వ్ 90 శాతం మూసుకుపోయిందని.. దాని వల్ల పరిస్థితి విషమించిందని అంటున్నారు. తారకరత్నకు ఎక్మో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి నందమూరి అభిమానులను టెన్షన్ పెట్టే సమాచారమే బయటికి వస్తోంది.
తారకరత్న పరిస్థితి మెరుగుపడ్డట్లు, కోలుకుంటున్నట్లు వార్తలు రాకపోవడంతో ఆందోళన పెరిగిపోతోంది. కాగా తారకరత్న భార్య ఇప్పటికే బెంగళూరుకు చేరుకోగా.. బాలకృష్ణ నిన్నట్నుంచే తన దగ్గరే ఉండి చికిత్స ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్యను చూసేందుకు బెంగళూరుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషమ స్థితి నుంచి తారకరత్న కోలుకుని మళ్లీ మామూలు మనిషి కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.