పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాకు ఈ మధ్యే ప్రారంభోత్సవం జరిగింది. ముందు ఈ కలయికలో రాబోయేది తెరి రీమేక్ అన్న అనుమానంతో పవన్ అభిమానులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేశారు. కానీ వాళ్లందరికీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో షాకిచ్చాడు హరీష్ శంకర్. ఈ టైటిల్, పోస్టర్ చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని అయోమయంలో పడిపోయారు ఫ్యాన్స్.
ఇంతకుముందు ప్రకటించిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ను పక్కన పెట్టి తమిళ హిట్ ‘తెరి’ని హరీష్-పవన్ రీమేక్ చేస్తున్నట్లు అందరూ భావించగా.. ఆ టైటిల్‌నే కొంచెం మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ కొత్త పోస్టర్ వదిలాడు హరీష్. ఈ పోస్టర్ చూస్తే అందరికీ ‘భవదీయుడు భగత్ సింగ్’యే గుర్తుకొచ్చింది. పోస్టర్లోనూ పోలికలు కనిసిం,చాయి.
దీంతో ఇది స్ట్రెయిట్ మూవీనా లేకా తెరి రీమేకా తెలియని కన్ఫ్యూజన్లో పవన్ ఫ్యాన్స్ సైలెంటైపోయారు. కానీ సస్పెన్సుకు తెరదించుతూ అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు దర్శకుడు దశరథ్. ఒక ఇంటర్వ్యూలో అతను పవన్-హరీష్ సినిమా గురించి మాట్లాడాడు. ఈ సినిమాకు తాను రచయితగా పని చేస్తున్నట్లు వెల్లడంచాడు. అంతే కాక ఇది తెరి మూవీకి రీమేకే అనే విషయం కూడా చెప్పేశాడు. ఐతే మూల కథను మాత్రమే తీసుకుని మార్పులు చేర్పులు చేసినట్లు, పవన్ క్యారెక్టర్ని కొత్తగా డిజైన్ చేసినట్లు దశరథ్ వెల్లడించాడు.
ఐతే ఎన్ని మార్పులు చేసినా రీమేకే కావడంతో ఈ సినిమా పట్ల అభిమానుల్లో అంత ఎగ్జైట్మెంట్ కలగడం కష్టమే. ఇది రీమేక్ అనే విషయం బయటపడిపోయాక పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని పవన్ వీలును బట్టి సెట్స్ మీదికి తీసుకెళ్లాలనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates