రేటింగుల గురించి మెగాస్టార్ మాట

వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వీరంగం పది రోజులుగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. ఇవాళ సోమవారం నుంచి గణనీయమైన డ్రాప్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆధిపత్యం మాత్రం చిరంజీవిదేన్న క్లారిటీ వసూళ్లలో బయట పడుతోంది. ఈ సందర్భంగా యుఎస్ మెగాభిమానులు నిన్న ఒకేసారి పాతిక లొకేషన్లలో స్పెషల్ గా ఫ్యాన్స్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేసుకున్నారు. మొదటి రోజు అన్నంత రేంజ్ లో హడావిడి చేస్తూ పూల చొక్కాలు లుంగీలతో మాస్ ఎంటర్ టైనర్ ని ఎంజాయ్ చేశారు. ఇక్కడో స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే చిరంజీవి నేరుగా వీడియో కాల్ ద్వారా లైవ్ లోకి రావడం.

స్క్రీనింగ్ మధ్యలో జూమ్ తరహా కాల్ ద్వారా ఒకేసారి అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. ముందు సూట్ లో వచ్చి పలకరించి ఆ తర్వాత కొన్ని నిముషాలు గ్యాప్ తీసుకుని వాల్తేరు వీరయ్య గెటప్ లో గాగుల్స్ పెట్టుకుని రావడంతో షోకు వచ్చిన వాళ్ళ ఆనందం మాములుగా లేదు. ఈ సందర్భంగా ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటూ సరదాగా ఒక విషయం చెప్పాలని రేటింగ్స్ ప్రస్తావన తెచ్చారు. చాలామంది తన సినిమాకు రెండు నుంచి రెండుంపావు రేటింగ్ ఇచ్చారని అయితే అప్పుడు ఏదో అనుకున్నామని తీరా చూస్తే ఇప్పుడదే నెంబర్ తో అంతే మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చిందని సరదా సెటైర్ వేశారు.

దీనికి ఫ్యాన్స్ స్పందన ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఏ ఉద్దేశంతో అన్నా నిజంగానే వాల్తేరు వీరయ్య ఏ క్రిటిక్ ఊహకు అందనంత అతీతంగా బ్లాక్ బస్టర్ అయిన మాట వాస్తవం. వంద కోట్ల షేర్ దాటేసి ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందో అంతు చిక్కడం లేదు. ఈ సక్సెస్ తాలూకు ఆనందం చిరు మోహంలో మాములుగా లేదు. మీకేం కావాలో అర్థమయ్యిందని ఇకపై సైరా గాడ్ ఫాదర్ లాంటి ప్రయోగాలు ఉండవని, కేవలం మాస్ మెప్పించే ఘరానా కంటెంట్ తోనే వస్తానని హామీ ఇచ్చేశారు. అయినా మాస్ పల్స్ పట్టేసుకోవడం కష్టంగా మారుతున్న ట్రెండ్ లో మరీ ఎక్కువ మూసకు కట్టుబడినా ఇబ్బందే.