విజయ్ 67లో అదిరిపోయే క్యాస్టింగ్

వరిసు కంటెంట్ రొటీన్ ఉందన్న కామెంట్స్ ఎన్ని వచ్చినా సునాయాసంగా నూటా యాభై కోట్ల గ్రాస్ తన స్టార్ ఫాలోయింగ్ తో తెచ్చి పడేసిన విజయ్ తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కొంచెం తెల్ల గెడ్డంని డిఫరెంట్ గా పెంచి హెయిర్ స్టైల్ మార్చి వెరైటీ లుక్ తో దర్శనమివ్వబోతున్నాడు. మొన్న దిల్ రాజు హైదరాబాద్ లో ఇచ్చిన వారసుడు సక్సెస్ పార్టీకి ఈ గెటప్ లోనే వచ్చాడు. విజయ్ తన నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజ్ తో. చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక ఈ కాంబో మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి.

దానికి తగ్గట్టే క్యాస్టింగ్ కూడా క్రేజీగా కుదురుతోంది. హీరోయిన్ గా త్రిష ఆల్రెడీ కన్ఫర్మ్ కాగా మరో కథానాయిక ఉండొచ్చని టాక్. మెయిన్ విలన్ సంజయ్ దత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర చేయనుండగా ఇతర క్యారెక్టర్స్ లో మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ లు కనిపిస్తారు. తాజాగా ఫహద్ ఫాసిల్ నేను కూడా ఉండొచ్చనే హింట్ ఇవ్వడంతో తారాగణం భారీగా మారిపోయింది. గతంలో వచ్చిన ఖైదీ, విక్రమ్, మాస్టర్ లను కలుపుతూ లోకేష్ ఒక సినిమాటిక్ యునివర్స్ ని సృష్టించబోతున్నాడని అందులో భాగంనే ఇలా పక్కా స్కెచ్ ని సిద్ధం చేస్తున్నారట.

ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. డిమాండ్ మాత్రం భీభత్సంగా ఉంది. శాటిలైట్, డబ్బింగ్, ఓటిటి హక్కుల కోసం కోట్లు కుమ్మరించేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. వారసుడు కమర్షియల్ గా వర్కౌట్ అయినా విజయ్ నుంచి మంచి కమర్షియల్ యాక్షన్ మూవీని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే లోకేష్ తో చేతులు కలపగానే హైప్ రెట్టింపు అయ్యింది. ఇందులో మరో తెలుగు హీరోని కూడా సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది కానీ అదెవరనే పేరు మాత్రం బయటికి తెలియలేదు. కుదరకపోతే తమిళ నటుడితో లాక్ చేస్తారు.