ఇంకా ఆరు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ ఒక రిలీజ్ డేట్ గురించి ఇండస్ట్రీలో అప్పుడే హాట్ డిస్కషన్ మొదలైపోయింది. అదే ఆగస్ట్ 11. ఇటీవలే బుట్టబొమ్మ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమాని ఆ డేట్ కి విడుదల చేయబోతున్నట్టు చెప్పేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నిర్మాణంలో ఆయనదే కీలక పాత్ర కాబట్టి ఊరికే ఏదో నోటి మాటగా అన్నారని కొట్టిపారేయలేం. పక్కా క్యాలికులేషన్లతోనే అనౌన్స్ చేశారు. యూనిట్ నుంచి పోస్టర్ రూపంలో కన్ఫర్మేషన్ రాకపోయినా ఇది పక్కానే.
మరోవైపు ఏప్రిల్ 14న ప్లాన్ చేసుకున్న రజనీకాంత్ జైలర్ ని ఆగస్ట్ 11కి వాయిదా వేయడం దాదాపు ఖరారయ్యిందని చెన్నై న్యూస్. స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ సెలవులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇండిపెండెన్స్ డే సోమవారం రావడంతో పెద్ద వీకెండ్ ఆ వారం సినిమాలకు దక్కనుంది. వీళిద్దరితోనే కథ అయిపోలేదు. అర్జున్ రెడ్డి తర్వాత దాని హిందీ రీమేక్ తప్ప ఇంకో మూవీ చేయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ తో తీస్తున్న యానిమల్ సైతం అదే తేదీని గతంలోనే లాక్ చేసుకుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని హీరో ఆటిట్యూడ్ ని ఇందులో చూస్తారనే టాక్ ఉంది.
ఈ ట్రయాంగిల్ వార్ చాలా రసవత్తరంగా ఉండనుంది. ఎందుకంటే మూడు ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. పుష్ప నుంచి వీటి తాకిడి ఎక్కువ కావడంతో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా అందరు హీరోలు మల్టీ డబ్బింగులు చేయమని నిర్మాతలను ప్రోత్సహిస్తున్నారు. ప్రాక్టికల్ గా చూస్తే వీటిలో మహేష్ మూవీ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ షూట్ ఇటీవలే మొదలైంది. జైలర్ సగానికి పైగా పూర్తి చేశారు. యానిమల్ షెడ్యూల్స్ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పడీ డెడ్ లైన్ మీట్ అవ్వాలంటే పరుగులు పెట్టాల్సింది సూపర్ స్టారే