ట్రోలర్స్‌కి క్లాస్.. మళ్లీ ట్రోలింగ్

టాలీవుడ్ యువ దర్శకుడు వంశీ పైడిపల్లి మీద ‘వారసుడు’ సినిమా విడుదలకు ముందు జరిగిన ట్రోలింగ్ అంతా ఒకెత్తయితే.. రిలీజ్ తర్వాత ఒక ఇంటర్వ్యూ వీడియో క్లిప్ వైరల్ అయ్యాక జరుగుతున్న ట్రోలింగ్ ఇంకో ఎత్తు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల సోషల్ మీడియాలో ట్రోలర్లకు పెద్ద కంటెంట‌్‌గా మారింది. ముఖ్యంగా ‘వారసుడు’ ట్రైలర్ చూశాక జనాలు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. చాలా తెలుగు సినిమాలను మిక్సీలో కొట్టి ఈ సినిమా తీసినట్లుగా అనిపించడమే అందుక్కారణం. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఇటు తెలుగువాళ్లు, అటు తమిళ జనాలు కలిపి వంశీని టార్గెట్ చేస్తున్నారు.

ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెర తీశాయి. తన సినిమాను సీరియల్‌తో పోల్చడం పట్ల వంశీ తీవ్రంగా స్పందించాడు. తాము ఒక సినిమా కోసం ఎంత కష్టపడతామో తెలుసా.. ఇంత కష్టపడి తీసే సినిమాను ఎలా ట్రోల్ చేస్తారు.. సీరియల్ అంటారు అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు వంశీ.

ఐతే ఎలాంటి సినిమా తీసినా విమర్శించకుండా చూడాల్సిందే అనడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తూ వంశీని మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. సినిమా కోసం అందులో పని చేసేవాళ్లు ఎంత కష్టపడతారో.. వివిధ రంగాల వాళ్లు అలాగే కష్టపడతారని.. కేవలం సినిమా వాళ్లదే కష్టం అనుకోవడం పొరబాటని అంటున్నారు. కష్టపడి తీశాం కాబట్టి తాము ఏం తీస్తే అది చూడాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

ఒక నెటిజన్.. “నేనొక హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేశాను. అతను చద్ది ఇడ్లీ, పాచిపోయిన చట్నీ పెట్టారనుకుందాం. డబ్బులు పెట్టి టిఫిన్ తినే నేను అతణ్ని ఇదేంటని ప్రశ్నించకూడదా” అని వంశీని ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ వేశాడు. డబ్బులు పెట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు క్వాలిటీ ప్రాడక్ట్ అందించాల్సిన బాధ్యత మేకర్స్‌దే అని.. పాత సినిమాలను తిప్పి తిప్పి కొట్టి రొటీన్ వంట వడ్డించి తాము కష్టపడ్డాం, ఏ విమర్శా చేయకండి అనడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు వంశీని ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు మరోసారి.