గతేడాది సంక్రాంతికి నాగార్జున ‘బంగార్రాజు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కినేని కాంబోలో వచ్చిన ఈ సినిమా మోస్తారు అంచనాలతో థియేటర్స్ లోకి అడుగుపెట్టి కంటెంట్ పరంగా రొటీన్ అనిపించుకుంది. ఫాంటసీ ఎలిమెంట్ తో ఈ సీక్వెల్ ప్లాన్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ రొటీన్ విలేజ్ డ్రామా సన్నివేశాలతో నిరాశ పరిచాడు. కాకపోతే సంక్రాంతి సీజన్ కలిసిరావడం , పైగా కాంపిటీషన్ లేకపోవడంతో మంచి వసూళ్లు అందుకుంది. ఆ ఏడాది ‘బంగార్రాజు’ తో కలిసి వచ్చిన ‘రౌడీ బాయ్స్’ , ‘హీరో’ సినిమాలు కూడా రొటీన్ కథలతో వచ్చినవే.
‘రౌడీ బాయ్స్’ రెండు మూడు సినిమాలను కలిపి తీశారని , ముఖ్యంగా బన్నీ ‘హ్యాపీ’ సినిమా కథకి కాస్త కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ కలిపారనే ఫీడ్ బ్యాక్ అందుకుంది. దాంతో 2022 సంక్రాంతి రొటీన్ అంటూ ప్రేక్షకులు చెప్పుకున్నారు. ఇక ఈ ఏడాదయినా దర్శకులు కొత్త కథలతో సరికొత్త టేకింగ్ తో పండుగ తెస్తారని ఆశించిన ప్రేక్షకుల ఆశ మీద నీళ్ళు చల్లాయి సంక్రాంతి సినిమాలు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ తో పాటు వారసుడు , ‘కళ్యాణం కమనీయం’ కూడా రొటీన్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాయి.
‘వాల్తేరు వీరయ్య’లో చిరు వింటేజ్ లుక్ , మేనరిజమ్స్ , కామెడీ వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో రవితేజ కొంత వరకు సినిమాను నిలబెట్టాడు. ఇవి మినహాయిస్తే బాబీ ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు. బాబీ మంచి కథకుడు. టేకింగ్ ఎలా ఉన్నా అతను రాసుకున్న కథలు , పాత్రలు బాగుంటాయి. కానీ మెగాస్టార్ పిలిచి అవకాశం ఇచ్చే సరికి తనలో ఉన్న రైటర్ ని పక్కన పెట్టేసి అభిమాన దర్శకుడిగా మారిపోయి రొటీన్ కంటెంట్ ప్లాన్ చేసుకున్నాడు. దీంతో సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించలేదు. రొటీన్ కథ -కథనంతో వచ్చిన బాబీ వింటేజ్ చిరుని చూపించి భారీ కలెక్షన్స్ రాబడుతున్నాడు.
‘వీర సింహా రెడ్డి’ కూడా రొటీన్ ఫార్ములాతో అల్లిన కథే. ఫస్ట్ హాఫ్ అంతా సింహా . లెజెండ్ లా సాగి రెండో భాగంలో చెన్న కేశవ రెడ్డి , సమర సింహా రెడ్డి సినిమాలను గుర్తుచేసింది. ‘క్రాక్’ లో అంతో ఇంతో కొత్తదనం చూపించి మాస్ ఆడియన్స్ కి బిర్యానీ పెట్టిన గోపిచంద్ మలినేని తన అభిమాన హీరో బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో ఓల్డ్ స్కూల్ ఫార్ములాతో ఈ సినిమా తీశాడు. బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్ , యాక్షన్ ఎపిసోడ్స్ బాగా పని అవ్వడంతో సంక్రాంతి బరిలో సినిమా బాగానే వసూళ్లు చేస్తుంది.
ఇక వారసుడు గురించి కొత్తగా చెప్పేదేముంది. ట్రైలర్ చూసే ఇది పరమ రొటీన్ సినిమా అని ఫిక్స్ అయిపోయిన ప్రేక్షకులకు చాలానే సినిమాలు గుర్తుచేశాడు వంశీ పైడిపల్లి. తమిళ్ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది అనుకున్నాడో ఏమో కానీ ‘వారసుడు’ తో తెలుగు ప్రేక్షకులను మాత్రం బోర్ కొట్టించాడు. కేరెక్టర్స్ , సన్నివేశాలు , ప్రీ క్లైమాక్స్ అన్నీ తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయి. ఇక కథలు ఉండేవి ఏడే కాదనలేం కానీ ఆ కథలో ట్విస్టులు , కీలక మలుపులు , సరికొత్త సన్నివేశాలు , కేరెక్టర్స్ తో మేజిక్ చేయడమే దర్శకుడి వంతు. అక్కడే కదా డైరెక్టర్ ప్రతిభ తెలిసేది. పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్స్ అనిపించుకున్న RRR , KGF2 , కాంతార , సినిమాల్లో కొత్త కథ లేదు కానీ, వాటిని దర్శకులుప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ‘కాంతార’ సినిమాకి రిశబ్ శెట్టి ఎంచుకున్న మూల కథ తొలి పదినిమిషాలు , చివరి పదిహేను నిమిషల ఎపిసోడ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.
మన తెలుగు దర్శకులు కూడా ఇలాంటి రొటీన్ సన్నివేశాలతో కాకుండా ప్రేక్షకులను మైమరిపించే అదిరిపోయే కంటెంట్ తో వస్తే తెలుగు సినిమా సంక్రాంతి సీజన్ లో మరెన్నో వండర్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సంక్రాంతి సీజన్ లో రొటీన్ సినిమాలతోనే ఇంత రాబడితే మెస్మరైజ్ చేసే కంటెంట్ తో వస్తే ఎలా ఉంటుందో దర్శకులు ఆలోచిస్తే బాగుంటుంది.