దిల్ రాజు పైడిపల్లి గెలిచినట్టేనా

గత ఏడాది తమిళనాడు అతి పెద్ద స్టార్ హీరోల్లో ఒకడైన విజయ్ తో సినిమా చేసే అవకాశం రావడం నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లికి జాక్ పాట్ కొట్టినట్టు అయ్యింది. అనుకున్నట్టుగా టైం ప్రకారం ప్లానింగ్ చేసుకుని సంక్రాంతికి విడుదల చేశారు. అయితే పండగ సీజన్ ని క్యాష్ చేసుకుంటూ వరిసు కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి కానీ తలపతి ఇమేజ్ రేంజ్ లో కాదనేది చెన్నై ట్రేడ్ వర్గాల టాక్. ఇంత ఫ్యామిలీ కంటెంట్ ప్లస్ హీరోయిజం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ మీద పూర్తి ఆధిపత్యం చెలాయించలేకపోవడానికి కారణం రెగ్యులర్ గా అనిపిస్తున్న ఫార్ములా టేకింగేనని అభిప్రాయపడుతున్నారు.

ఇది కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ వరిసు ఒరిజినల్ వెర్షన్ సూపర్ హిట్ దిశగా వెళ్తున్న మాట వాస్తవం. వంద కోట్ల గ్రాస్ దాటేసింది. కాకపోతే బ్లాక్ బస్టర్ అవుతుందా లేదనేది ఫైనల్ ఫిగర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అజిత్ తునివు నుంచి వచ్చిన విపరీతమైన పోటీ స్పీడ్ బ్రేకర్ లా అడ్డు తగిలింది. ఇక తెలుగు విషయానికి వస్తే వారసుడుకి నిర్మాత దిల్ రాజు ముందు ప్లాన్ చేసుకున్నట్టే పెద్ద రిలీజ్ వచ్చేలా చేశారు. మంచి థియేటర్లు దక్కడంతో విజయ్ కు సహజంగా వచ్చే ఓపెనింగ్స్ తో పాటు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల ఓవర్ ఫ్లోస్ బాగా కలిసి వచ్చినట్టు గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. తెగింపు రెండో రోజుకే వాష్ ఔట్ అయ్యింది.

వారసుడు రెండు రోజులకు గాను సుమారు 6 కోట్ల దాకా షేర్ వచ్చినట్టు సమాచారం. బ్రేక్ ఈవెన్ 14 కోట్లు కావడంతో లాభాలు అందుకునేందుకు చేయాల్సిన ప్రయాణం సగానికి పైగానే ఉంది. చిరంజీవి బాలకృష్ణ సినిమాల్లో ఉన్న కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ వారసుడులో కొరవడటంతో కామన్ ఆడియన్స్ దీని మీద ఏమంత ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు వరిసుని అరవ జనాలు ఎంత బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నా మన ప్రేక్షకులకు మాత్రం గతంలో చూసిన ఎన్నో సినిమాల కలబోతగా అనిపించడంతో ప్రాధాన్యత క్రమంలో ముందువరసలో లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే రాజు పైడిపల్లిలు కోరుకున్న గెలుపులో సగమే నెరవేరేలా ఉంది.