సాయిపల్లవి ఎక్కడ?


హీరోయిన్లన్నాక గ్లామర్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. చాలా కొద్దిమంది మాత్రమే నటనతో ఆకట్టుకుని ఫాలోయింగ్ పెంచుకుంటారు. నయనతార, అనుష్క, సమంత లాంటి పెర్ఫామర్లు కూడా కెరీర్ ఆరంభంలో ఎక్కువగా గ్లామర్ రోల్స్‌తోనే ఫాలోయింగ్ సంపాదించారు. కానీ సాయిపల్లవి మాత్రం అందరికీ భిన్నం. ఆమె కెరీర్ ఆరంభం నుంచి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తోనే గుర్తింపు తెచ్చుకుంది. తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించింది. కేవలం ఆమె కోసమే థియేరట్లకు వచ్చే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఐతే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కే పరిమితం అయితే.. ఎక్కువ అవకాశాలు అందుకోవడం అంటే కష్టమే. అలాంటి పాత్రలు ఉన్న కథలు చాలా తక్కువగా తయారవుతుంటాయి ఇండస్ట్రీలో. దీనికి తోడు ఈ మధ్య సాయిపల్లవి సినిమాలు కమర్షియల్‌గా కూడా సరైన విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్ స్లో అయిపోయింది.

గత ఏడాది తెలుగులో ‘విరాటపర్వం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సాయిపల్లవి. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా.. సినిమా మాత్రం కమర్షియల్‌గా దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇది సాయిపల్లవి కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. సాయిపల్లవి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ విషయంలోనూ ఇదే పరిస్థితి. దానికీ ప్రశంసలు దక్కాయి. కలెక్షన్లు లేవు. ఈ రెండు చిత్రాల తర్వాత సాయిపల్లవికి తెలుగులో అవకాశాలే లేవు.

ఆమెకు ఎవరూ పాత్రలు ఆఫర్ చేయట్లేదా.. లేక తనకే నచ్చిన పాత్రలు దక్కక తిరస్కరిస్తోందా అన్నది తెలియదు కానీ.. ఒకప్పుడు తెలుగులో మంచి ఊపు మీద సాగిన సాయిపల్లవి కెరీర్ ఇప్పుడు డల్ అయిపోయింది. కొన్ని నెలల పాటు ఆమె పేరే వినిపించకపోవడంతో జనాలు నెమ్మదిగా తనను మరిచిపోతున్నారు. మలయాళంలో కూడా సాయిపల్లవి సినిమాలేమీ చేయట్లేదు. తమిళంలో మాత్రం శివకార్తికేయన్ సరసన ఒక సినిమాకు కమిటైంది. ఇంత టాలెంట్ పెట్టుకుని సాయిపల్లవి ఒకే ఒక్క సినిమాకు పరిమితం కావడం అభిమానులకు రుచించడం లేదు.