కేజీఎఫ్‌-3.. క్లారిటీ ఇచ్చేశారుగా

కేజీఎఫ్‌.. ఈ సినిమా సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సౌత్ ఇండియాలో క్వాలిటీ, మార్కెట్ ప‌రంగా దిగువ‌న ఉండే క‌న్న‌డ ఫిలిం ఇండ‌స్ట్రీ నుంచి ఇండియా మొత్తాన్ని షేక్ చేసే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. భాష, ప్రాంతం అనే భేదం లేకుండా దేశ‌వ్యాప్తంగా కేజీఎఫ్ ఆశ్చ‌ర్య‌క‌ర వ‌సూళ్లు సాధించగా.. దీనికి కొన‌సాగింపుగా వ‌చ్చిన కేజీఎఫ్‌-2 మ‌రింత సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో దూసుకెళ్లింది. క‌న్న‌డ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

కేజీఎఫ్‌-2 డివైడ్ టాక్‌ను త‌ట్టుకుని మెగా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో దీన్ని పెద్ద ఫ్రాంఛైజీగా మార్చాల‌ని మేక‌ర్స్ ఫిక్స‌యిపోయారు. కేజీఎఫ్‌-2 రిలీజైన‌పుడే కేజీఎఫ్‌-3 గురించి హింట్ ఇచ్చేయ‌గా.. ఇప్పుడు హోంబ‌లె ఫిలిమ్స్ అధినేత విజ‌య్ కిర‌గందూర్.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ కేజీఎఫ్ ఫ్రాంఛైజీ మూడో పార్ట్‌తో ఆగ‌ద‌ని క్లారిటీ ఇచ్చాడు.

ముందుగా కేజీఎఫ్‌-3 గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా 2025లో సెట్స్ మీదికి వెళ్తుంద‌ని.. 2026లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని విజ‌య్ వెల్ల‌డించాడు. కేజీఎఫ్‌-4, 5 భాగాలు కూడా వ‌స్తాయ‌ని చెప్పిన విజ‌య్.. ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం కూడా వెల్ల‌డించాడు. కేజీఎఫ్ ఫ్రాంఛైజీలో వేరే హీరోలు కూడా న‌టించొచ్చ‌ని చెప్పాడు. జేమ్స్ బాండ్ త‌ర‌హాలో రాకీ పాత్రను మారుస్తామ‌ని.. బాండ్ సినిమాల్లో వేర్వేరు హీరోలు న‌టించిన‌ట్లు.. ఈ ఫ్రాంఛైజీలోనూ వేరే హీరోలు న‌టించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని చెప్పాడు విజ‌య్.

ఐతే రాకీ పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించుకోవ‌డం అంటే క‌ష్ట‌మే. అద‌నంగా ఇంకో హీరోను పెట్ట‌డం అంటే ఓకే కానీ.. రాకీగా య‌శ్ స్థానంలోకి మ‌రో హీరో వ‌స్తే మాత్రం ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేం. ఆ సంగ‌త‌లా ఉంచితే.. కేజీఎఫ్‌-3 అమెరికా నేప‌థ్యంలో సాగుతుంద‌నే ప్ర‌చారం ఇంత‌కుముందే జ‌రిగింది. కాబ‌ట్టి రాకీ ఈసారి ప్ర‌పంచాన్ని ఏలే ప్ర‌ణాళిక‌తో రంగంలోకి దిగుతాడ‌న్న‌మాట‌.