‘వారసుడు’ వెనుక మెగా వ్యూహం ?

‘వారసుడు’ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే చాలా ఇష్యూస్ ఎదుర్కున్నాడు దిల్ రాజు. అటు మెగా ఫ్యాన్స్ ఇటు బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దిల్ రాజును ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నైజాం , ఉత్తరాంధ్ర లో మంచి థియేటర్స్ అన్నీ వారసుడు కోసం దిల్ రాజు బ్లాక్ చేశారని ఫ్యాన్స్ తమ కోపాన్ని దిల్ రాజుపై చూపిస్తూనే ఉన్నారు. అయినా రిలీజ్ విషయంలో, థియేటర్స్ కౌంట్ లో తగ్గదేదే లే అంటూ దిల్ రాజు చెప్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూళ్లో కూడా ‘వారసుడు’కి తను నిర్మాత అని తన వ్యాపారం తను చేసుకుంటానని ఫైనల్ గా ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఆడుతుందని చెప్పుకున్నాడు.

కానీ రాత్రికి రాత్రి ‘వారసుడు’ రిలీజ్ డేట్ మార్చేసుకున్నారు రాజు. ఇప్పటికే ‘వారసుడు’ తెలుగు రిలీజ్ పై దిల్ రాజు ఇండస్ట్రీ నుండి మీడియా నుండి చాలా ప్రశ్నలు ఎదుర్కున్నారు. కానీ వాటన్నిటికీ జవాబిస్తూనే వచ్చాడు. ఒక టైమ్ లో దిల్ రాజు ఇక తగ్గడేమో అనుకున్నారంతా ఫైనల్ గా వెనక్కి తగ్గి ‘వారసుడు’ తెలుగు రిలీజ్ ను జనవరి 11 నుండి 14 కి వాయిదా వేసుకున్నారు. తమిళ్ లో ప్రకటించిన జనవరి 11 కే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అక్కడ రిలీజైన రెండ్రోజుల తర్వాత ఇక్కడ డబ్బింగ్ సినిమాగా వారసుడు రిలీజ్ కానుంది.

అయితే ‘వారసుడు’ రిలీజ్ విషయంలో వెనక నుండి ఇండస్ట్రీ పెద్దలు కొందరు చక్రం తిప్పారని తెలుస్తుంది. ముఖ్యంగా దీని వెనుక మెగా వ్యూహం ఉందని టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు తో నేరుగా చిరంజీవి మాట్లాడారని అంటున్నారు. ఇక మైత్రి నిర్మాతలు మొన్నటి వరకూ దిల్ రాజు తో మాట్లాడుతూనే ఉన్నారట, కానీ దిల్ రాజు మొండి పట్టు చూసి ఫైనల్ గా మెగా స్టార్ ని రంగంలోకి దింపారని అంటున్నారు. చిరు విషయంలోకి ఎంటరయ్యాకే దిల్ రాజు వెనక్కి తగ్గారని, అందుకే తన డబ్బింగ్ సినిమాను వెనక్కి జరిపి వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య లకి దిల్ రాజు సైడ్ ఇచ్చారని తెలుస్తుంది. ఏదేమైనా ఈ సారి సంక్రాంతి సినిమాల తెరవెనుక చాలా జరుగుతున్నాయి.