తాప్సి బి-గ్రేడ్ హీరోయిన్-కంగ‌నా ర‌నౌత్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సి ప‌న్ను.. అక్క‌డ ఏ అండా లేకుండా సొంతంగా క‌ష్ట‌ప‌డి నిల‌దొక్కుకుంది. త‌నకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు త‌న పేరు మీద సినిమాలు ఆడే రేంజ్ వ‌చ్చింది. త‌న లాగే క‌ష్ట‌ప‌డి ఎదిగిన తాప్సిని చూసి సంతోషించాల్సిన, ప్రోత్స‌హించాల్సిన కంగ‌నా ర‌నౌత్ ప‌దే ప‌దే ఆమెను టార్గెట్ చేయ‌డం.. దారుణ‌మైన కామెంట్లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.

తాప్సి త‌న‌ను కాపీ కొడుతుంద‌ని.. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మాఫియాకు స‌పోర్ట్ చేస్తుంద‌ని.. త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంది కంగ‌నా. తాజాగా మ‌రోసారి తాప్సిని టార్గెట్ చేసిందామె. తాప్సి గురించి పాజిటివ్ కామెంట్ చేస్తున్న‌ట్లే చేసి.. ఆమెను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసింది ఓ ఇంట‌ర్వ్యూలో కంగ‌నా.

తాప్సి, స్వ‌ర భాస్క‌ర్ ప్ర‌తిభావంతులైన న‌టీమ‌ణుల‌ని.. కానీ వాళ్లు బాలీవుడ్ మాఫియా కార‌ణంగా బి-గ్రేడ్ హీరోయిన్లుగా మిగిలిపోయార‌ని వ్యాఖ్యానించింది కంగ‌నా. తాప్సి లాంటి వాళ్లు నెపోటిజం బ్యాచ్‌కు స‌పోర్ట్ చేస్తార‌ని.. వీళ్ల వ‌ల్లే నెపోటిజం వ‌ర్ధిల్లుతోంద‌ని కూడా కంగ‌నా కామెంట్ చేసింది.

దీనిపై తాప్సి సెటైరిక‌ల్‌గా ఓ ట్వీట్ వేసింది. త‌న‌ను, స్వ‌ర‌ను బి-గ్రేడ్ హీరోయిన్లుగా కంగ‌నా పేర్కొన‌డంపై స్పందిస్తూ.. 10, 12 త‌ర‌గ‌తుల్లో గ్రేడ్‌లు ఇచ్చేవార‌ని, ఇప్పుడు కూడా గ్రేడింగ్స్ ఇస్తున్నారా అని ఆమె ప్ర‌శ్నించింది. తాను క‌ర‌ణ్ జోహార్ స‌పోర్ట‌ర్ అంటూ కంగ‌నా చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పుడూ క‌ర‌ణ్‌ను పొగ‌డ‌లేద‌ని.. అలాగ‌ని తిట్టాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని అంది.