ఏ నటుడైనా ఎన్ని పాత్రలు చేశామనే దానికన్నా ఎన్ని విలక్షణమైన సినిమాలతో గుర్తుండిపోయేలా నటించామన్నది కీలకం. దానికో చక్కని ఉదాహరణ చలపతిరావుగారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ గూఢచారి 116తో సినీ రంగప్రవేశం చేశాక రెండు దశాబ్దాలకు పైగా ఆయన ఎక్కువ విలన్ పాత్రలకే అంకితమయ్యారు.
సినిమాలో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టుల రేప్ లకు చలపతిరావు పెట్టింది పేరు. ఈ విషయంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఒకదశలో ఆడాళ్ళు తనను చూసి భయపడేవారని చెప్పుకొచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెరిగాక పెద్దాయన కాంబినేషన్లో లెక్కలేనన్ని చిత్రాలు చేశారు.
ఒకే ఒక్క మలుపు చలపతిరావులోని మరో కోణం ఆవిష్కరించింది. అదే 1996లో వచ్చిన కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతా. నాగార్జున తండ్రిగా, చంద్రమోహన్ ప్రాణ స్నేహితుడిగా, రెండు కుటుంబాలకు పెద్ద మనిషిగా కనిపించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఇలా కూడా చూపించవచ్చనే మార్గదర్శకత్వం ఇతర డైరెక్టర్లకు కలిగింది ముఖ్యంగా అందులో సీనియర్ నటి లక్ష్మితో సరదాగా అనిపించే రొమాంటిక్ సన్నివేశాల్లో పండించిన సున్నితమైన హాస్యం బాగా పేలింది. అక్కడితో మొదలు చలపతిరావుగారికి అన్నీ పాజిటివ్ వేషాలు రావడం మొదలయ్యింది. ఒక పదేళ్లకు పైగానే చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు
నువ్వే కావాలి, చాలా బాగుంది, నిన్నే ప్రేమిస్తా, ఆమ్మో ఒకటో తారీఖు, అల్లరి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పక్కింట్లో ఉండే బాబాయ్, మావయ్య, అంకుల్ తరహా అనిపించే చక్కని పాత్రలు. 2002 ఆదిలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ గా చేయడం ఇంకో పెద్ద బ్రేక్. ఎమోషన్స్ తో పాటు అందులో హీరోకు సపోర్ట్ నిలిచే ఎలివేషన్ గొప్పగా పండింది.
చిన్నా పెద్దా కలిపి పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నిర్విరామంగా నటించడం చలపతిరావుగారు దక్కించుకున్న అరుదైన ఘనత. కెఎస్ఆర్ దాస్ తో మొదలుపెట్టి బోయపాటి శీను దాకా నాలుగు తరాల దర్శకులతో పనిచేయడం కొందరికి మాత్రమే సాధ్యమయ్యింది
Gulte Telugu Telugu Political and Movie News Updates