తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తుతో గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల కిందట మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ‘మీ టూ’ మూమెంట్ మొదలైనపుడు మొదటిసారిగా వైరముత్తు మీద తీవ్ర ఆరోపణలు చేసింది చిన్మయి. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఆయన్ని కలిసినపుడు తనను లైంగికంగా లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నించాడని.. ఆయన ఎందరో అమ్మాయిలకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపించింది. కాకపోతే వీటికి సాక్ష్యాలేమీ చూపించలేని నిస్సహాయతను ఆమె వ్యక్తం చేసింది.
వైరముత్తు మీద మహిళా కమిషన్‌కు కంప్లైంట్లు కూడా చేసిన ఆమె తనకు న్యాయం జరగట్లేదంటూ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. సందర్భం వచ్చినపుడల్లా వైరముత్తు వ్యవహారాల గురించి ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంది. ఐతే ఒక దశ తర్వాత ఈ వ్యవహారం జనాలకు మొహం మొత్తేసిందో ఏమో.. పట్టించుకోవడం మానేశారు. కానీ చిన్మయి మాత్రం పోరాటం ఆపలేదు.
మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి వైరముత్తు మీద మళ్లీ పడింది చిన్మయి. కోలీవుడ్‌కు చెందిన అర్చన అనే యువ నటి.. తాజాగా వైరముత్తును కలిసిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. అర్చన తలపై చేయి పెట్టి మాట్లాడుతున్న, అలాగే ఆమె పక్కన నిల్చున్న వైరముత్తును ఉద్దేశించి చిన్మయి హెచ్చరికలు జారీ చేసింది.
‘‘ముందు ఇలాగే మొదలవుతుంది. ఆయన గొప్ప వ్యక్తి లాగే వ్యవహరిస్తాడు. దయచేసి అప్రమత్తంగా ఉండు. వీలైనంతగా దూరం పెట్టు. అలాగే నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి ఆయన్ని కలవకు’’ అంటూ కామెంట్ చేసింది చిన్మయి. వైరముత్తు చేసే లైంగిక వేధింపులకు సంబంధించి సాక్ష్యాలేమీ చూపించలేకపోయినా.. ఆయన మీద ఇలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ అలుపెరగని పోరాటం చేయడం ద్వారా ఆయన మీద జనాలకు సందేహాలు కలిగేలా చేయడంలో మాత్రం చిన్మయి విజయవంతం అయిందనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates