తమిళంలో ‘చెల్లమే’ అనే చిన్న సినిమాతో మొదలుపెట్టి.. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ కామెంట్లు ఎదుర్కొని.. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. తెలుగు వాడే అయిన విశాల్‌కు తమిళంలో అంత మంచి గుర్తింపు దక్కడం.. నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా అతను ఎన్నిక కావడం మన వారికి సంతోషాన్నిచ్చే విషయమే.
ఐతే కొన్నేళ్లుగా విశాల్‌కు బాక్సాఫీస్ దగ్గర పెదదగా కలిసి రావడం లేదు. అభిమన్యుడు, డిటెక్టివ్ లాంటి చిత్రాలతో మంచి ఊపు మీద కనిపించిన అతను.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు. పందెంకోడి-2, యాక్షన్, చక్ర, సామాన్యుడు.. ఇలా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. దీంతో అతడి క్రేజ్, మార్కెట్ దెబ్బ తిన్నాయి. త్వరలో అతను ‘లాఠి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ అది కూడా రొటీన్ యాక్షన్ మూవీలాగే కనిపిస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విశాల్.. ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. తమిళ టాప్ స్టార్ అయిన విజయ్ హీరోగా.. ప్రస్తుతం అక్కడ నంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో విలన్ పాత్రకు తనను అడిగారని, కానీ తాను డేట్ల సమస్య వల్ల అంగీకరించలేదని విశాల్ తెలిపాడు. ఈ చిత్రంలో విశాల్ విలన్ అంటూ కొన్ని రోజుల కిందట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు విశాలే స్వయంగా తనకు లోకేష్ ఈ కథ చెప్పి, విలన్ పాత్రకు అడిగినట్లు వెల్లడించడు. కానీ లోకేష్ తనను చాలా డేట్లు అడిగాడని.. ఆల్రెడీ తనకున్న కమిట్మెంట్ల వల్ల ఈ సినిమాను ఒప్పుకోలేకపోయానని తెలిపాడు విశాల్. కాగా విజయ్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని.. అది తన స్వీయ దర్శకత్వంలో ఉండొచ్చని విశాల్ చెప్పడం విశేషం.
ఐతే విశాల్.. విజయ్ సినిమాలో విలన్ పాత్ర చేస్తే ఆ సినిమాకు ఉపయోగపడడమే కాక.. తన కెరీర్‌కు కూడా ఈ సినిమా బాగా ప్లస్ అయ్యేది. లోకేష్ చిత్రాల్లో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ‘మాస్టర్’లో విలన్ పాత్ర చేసిన విజయ్ సేతుపతి విజయ్‌ని మించి హైలైట్ అవడం తెలిసిందే. కాబట్టి విశాల్ ఎలాగోలా డేట్లు సర్దుబాటు చేసుకుని ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కావాల్సింది.