ఈ మధ్య పాత బ్లాక్‌బస్టర్లను, కల్ట్ మూవీస్‌ను రీరిలీజ్ చేయడం ట్రెండుగా మారింది. స్టార్ హీరోల అభిమానులు రీరిలీజ‌్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హంగామా చేయడం.. రికార్డుల గురించి సోషల్ మీడియాలో గొడవలు పడడం కూడా జరుగుతోంది. ఐతే పోకిరి, జల్సా సినిమాల వరకు అంతా బాగానే నడిచినా.. ఆ తర్వాతి సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. వీటిలో కూడా ఫేక్ రికార్డుల చర్చ మొదలై వ్యవహారం పక్కదారి పడుతున్నట్లు కనిపించింది.
ఇటీవల రెబల్, వర్షం, బాద్‌షా లాంటి చిత్రాలకు సరైన స్పందనే కనిపించలేదు. అయినా సరే ఇప్పుడు ఓ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ చిత్రమే.. నారప్ప. ఈ నెల 13న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి దించుతున్నారు. ఈ సినిమా వసూళ్లను ఛారిటీ కోసం ఉపయోగించనున్నారట.
ఐతే మిగతా రీ రిలీజ్‌లతో పోలిస్తే ‘నారప్ప’ పరిస్థితి భిన్నం. ఈ సినిమా ఇంతకుముందు థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదలైంది. అది కూడా ఏళ్ల ముందు కాదు. గత ఏడాదే ఇలా రిలీజ్ చేశారు. అమేజాన్ ప్రైమ్ లాంటి ఎక్కువ సబ్‌స్క్రిప్షన్లు ఉండే ఓటీటీలో కావడంతో జనం టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాను చూశారు. వెంకీ కెరీర్లో చాలా ఏళ్ల ముందు వచ్చిన ఏదైనా కల్ట్ మూవీనో, బ్లాక్‌బస్టర్నో తీసుకొచ్చి రిలీజ్ చేసి ఉంటే దాన్ని నోస్టాల్జిక్‌గా ఫీలై చూసేవారేమో. పైగా వెంకీ అభిమానులు మిగతా స్టార్ హీరోల అభిమానుల్లాగా తమ కథానాయకుడి కోసం మ్యాడ్‌నెస్‌తో ఊగిపోయేవాళ్లు కాదు. వెంకీ కొత్త సినిమాల రిలీజ్ టైంలో కూడా అంత హడావుడి కనిపించదు. వస్తారు కామ్‌గా సినిమా చూసి వెళ్తారు. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనే ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్లంతా ఇప్పుడు థియేటర్లలో ‘నారప్ప’ను చూడ్డానికి ఎగబడే పరిస్థితి లేదు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేవు.
‘నారప్ప’ను అప్పట్లో థియేటర్లలో రిలీజ్ చేయలేదని ఫీలయ్యారని, అందుకే ఈ సినిమాను ఇప్పుడు ఇలా విడుదల చేస్తున్నామని సురేష్ బాబు అంటున్నారు. ఐతే అప్పుడు థియేటర్లు అందుబాటులో ఉన్నా సరే.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ చేసినందుకు ఫీలయ్యారే తప్ప.. ఇప్పుడు వెంకీ ఫ్యాన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని ఎగబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 13న ‘నారప్ప’ థియేటర్లలో ఏమాత్రం సందడి ఉంటుందా అన్నది సందేహమే.