ఎటాక్.. మొన్న ప్రైమ్.. నిన్న హాట్ స్టార్.. నేడు నెట్ ఫ్లిక్స్

ఐదు నెలలుగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. దీంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ హవా నడుస్తోంది. పాత, కొత్త సినిమాలతో మోత మోగించేస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా కొత్త చిత్రాల్ని వీటిలో రిలీజ్ చేసేస్తున్నారు. ఫ్యాన్సీ ఆఫర్లతో నిర్మాతల్ని టెంప్ట్ చేస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్.

అమేజాన్ ప్రైమ్ ముందుగా ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించింది. వివిధ భాషల్లో ఎనిమిది కొత్త సినిమాలను కొని.. ఒకదాని తర్వాత ఒకటిగా రిలీజ్ చేస్తోంది. ఆ తర్వాత డిస్నీ-హాట్ స్టార్ రంగంలోకి దిగింది. లక్ష్మీబాంబ్, బుజ్, దిల్ బేచరా లాంటి పేరున్న సినిమాల్ని కొని హడావుడి మధ్య వాటి రిలీజ్ డేట్లు ప్రకటించింది.

ఐతే తమ ముందు చిన్నవైన హాట్ స్టార్, అమేజాన్ ప్రైంలే అంత దూకుడు ప్రదర్శిస్తే.. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఊరుకుంటారా? ఊరుకోలేదు. ఇండియన్ మార్కెట్ మీద ఈ మధ్య బాగా దృష్టిసారిస్తున్న నెట్ ఫ్లిక్స్ ఒకేసారి 17 భారతీయ చిత్రాలను దక్కించుకుని వాటి రిలీజ్ గురించి ప్రకటన చేసింది. అందులో జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తొర్భాజ్’, నవాజుద్దీన్ మరియు రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాత్ అఖేలి హై’, భూమి పెడ్నేకర్ నటించిన ‘డాలీ కిట్టి ఔర్ వో లాంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

ఇంకా లూడో, క్లాస్ ఆఫ్ 83, గన్నీ వెడ్స్ సన్నీ, ఏ సూటబుల్ బాయ్, మిస్ మ్యాచ్డ్, ఏకే వర్సస్ ఏకే, సీరియస్ మెన్, త్రిభంగా, ఖాలీ ఖుహి, బాంబే రోజ్, భాగ్ బీనీ భాగ్, బాంబే బేగమ్స్, మసబా మసబా సినిమాలున్నాయి ఈ జాబితాలో. ఇవి కాక కొన్ని ప్రాంతీయ చిత్రాలను కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాలను వచ్చే మూడు నెలల్లో రిలీజ్ చేయబోతోంది