తారక్-చరణ్ ఫ్యాన్స్ మారరా?

నిన్న సాయంత్రం నుంచి తెలుగు ట్విట్టర్ సర్కిల్స్‌లో రెండు విచిత్రమైన హ్యాష్ ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటి #CheckDM కాగా.. ఇంకోటి #DMopencheyandi. ఇక్కో దాని మీద లక్షకు పైగా ట్వీట్లు పడడం విశేషం. ఆ హ్యాష్ ట్యాగ్ ఓపెన్ చూస్తేనేమో అన్నీ అబ్యూజిటివ్, ట్రోలింగ్ ట్వీట్లే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ #CheckDM హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ చరణ్‌ మీద ట్రోల్స్ వేస్తుంటే.. చరణ్ ఫ్యాన్స్ #DMopencheyandi హ్యాష్ ట్యాగ్ పెట్టి రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

ముందు ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏమిటో.. కొత్తగా ఈ గొడవేంటో చాలామందికి అర్థం కాలేదు. దీనికంతటికీ మెగా హీరో సాయిధరమ్ తేజ్ పెట్టిన ఒక పోస్టు కారణమని తర్వాత జనాలకు అర్థమైంది. కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడితో తేజు చేసిన కొత్త సినిమా టీజర్ ఈ రోజే రిలీజ్ కాబోతోంది. కాగా ఈ టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తారక్ పేరు ముందు Man of masses అనే ఉపమానాన్ని వాడాడు తేజు.

ఐతే ఈ ట్యాగ్ విషయంలో ఎప్పట్నుంచో తారక్, చరణ్ అభిమానుల మధ్య గొడవ నడుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ మా హీరో అంటే మా హీరో అని వాళ్లు వాదించుకుంటున్నారు. ఇలాంటి టైంలో మెగా హీరో అయిన తేజు.. తారక్‌కు ఆ ట్యాగ్ ఇవ్వడంతో మెగా అభిమానులకు నచ్చలేదు. దీంతో తేజును నేరుగా విమర్శించలేక #CheckDM హ్యాష ట్యాగ్ పెట్టి.. ఆ ట్యాగ్ తీసేయమంటూ డైరెక్ట్ మెసేజ్‌ల్లో వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్. ఇది చూసి తారక్ ఫ్యాన్స్ ట్రోల్స్ వేయడం మొదలుపెట్టారు.

మెగా హీరోనే తారక్‌ను ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఆ ట్యాగ్ తమ హీరోకే సొంతమని పేర్కొంటూ, ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి చరణ్‌ను, మెగా అభిమానులను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా చరణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. #DMopencheyandi అంటూ గతంలో తారక్ ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ పెట్టి తమ బాధను వెళ్లగక్కిన విషయాన్ని గుర్తు చేస్తూ ట్రోల్స్ వేయడం మొదలుపెట్టారు. ఈ గొడవ ఒక దశ దాటాక మరీ వెగటు పుట్టించేలా తయారైంది. ఓవైపు ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డుల వైపు పరుగులు పెడుతుంటే, తారక్-చరణ్ ఆప్త మిత్రుల్లా మెలుగుతుంటే వారి అభిమానుల మధ్య గొడవ మాత్రం రోజు రోజుకూ శ్రుతి మించుతుండడం విచారకరం.