పల్లెటూళ్ళలో లక్ష థియేటర్లు – వర్కౌట్ అవుతుందా

టెక్నాలజీ ఎంత పెరిగి ఓటిటిలు ఎన్ని వచ్చినా అవి థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు సరిసాటి కాదనేది ఎవరైనా ఒప్పుకునే వాస్తవం. మల్టీ ప్లెక్స్ కల్చర్ వచ్చాక సింగల్ స్క్రీన్ల మనుగడకు ఇబ్బందొచ్చి పడింది. డబ్బు ఎక్కువ ఖర్చైనా పర్లేదు సౌకర్యాలు ముఖ్యమనుకునే రీతిలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోవడంతో ఈ రంగంలో గణనీయమైన విప్లవం చోటు చేసుకుంది. అలా అని ఇదేదో మూడు పువ్వులు ఆరు కాయలు తరహాలో బ్రహ్మాండంగా నడుస్తున్న వ్యాపారం కాదు. అన్ని రంగాల్లో లాగే హెచ్చు తగ్గులు ఇక్కడా ఉన్నాయి. అయితే పల్లెటూళ్ళకు మాత్రం ఈ అనుభూతి ఇంకా త్వరగా అందుకోలేనంత దూరంలోనే ఉంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సిఎస్సి ఈ గవర్నెన్స్ రాబోయే రెండేళ్లలో గ్రామాల్లో10 వేల స్క్రీన్లను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో ఎవరైనా భాగస్వామ్యం కావొచ్చు. పల్లెటూళ్ళో హాలుకు సరిపడే చోటు ఉంటే చాలు ఆర్థిక వనరులతో పాటు కావాల్సినంత మద్దతు సదరు సంస్థే చూసుకుంటుంది. అంటే ఫ్రాంచైజ్ తరహాలో అన్నమాట. ఒక్కో థియేటర్ లో వంద నుంచి రెండు వందల దాకా సీట్లు ఉంటాయి. 15 లక్షల కనిష్ట పెట్టుబడి ఉంటే చాలు ఇవి మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇది ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాబోయే అయిదేళ్లలో మొత్తం లక్ష స్క్రీన్లు టార్గెటట

వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇదెంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ఒకప్పటిలా జనం ఇప్పుడు టైం పాస్ కోసమో ఏసి కోసమో ప్రతి సినిమాను చూసేందుకు ఇష్టపడటం లేదు. హిట్లున్న టైంలో సందడి కనిపిస్తుంది కానీ మాములు రోజుల్లో ముఖ్యంగా వీక్ డేస్ లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటోంది. అలాంటప్పుడు ఇన్నేసి థియేటర్లు వచ్చేస్తే ప్రయోజనాలతో పాటు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. టికెట్ రేట్లను సగటు సామాన్యులకు అందుబాటులో ఉంచితే వీటి నుంచి మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఆలోచనైతే బాగానే ఉంది మరి.