చిరు & ఓదెల మూవీ….నాని మెచ్యూరిటీ

ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపించాలనే విషయంలో కొందరు దర్శకులు పడుతున్న తడబాటు భోళా శంకర్, ఆచార్య లాంటి డిజాస్టర్లు, గాడ్ ఫాదర్ లాంటి యావరేజులిస్తున్న మాట వాస్తవం. ఎంతసేపూ ఆయనలో యాక్షన్, డాన్స్ వాడుకుందామనే తాపత్రయం తప్ప జైలర్ రజనీకాంత్ లాగా పర్ఫెక్ట్ హీరోయిజంతో ఎందుకు చూపించకూడదనే ప్రశ్న మెగా ఫాన్స్ లో ఉంది.  రికార్డులు సాధించిన వాల్తేరు వీరయ్య ఈ విషయంలో కొంత మినహాయింపుగా నిలిచినా మెగా స్థాయికి అది కూడా సరిపోలేదు. త్వరలో ఆయనకు నిర్మాతగా మారనున్న నాని ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు.

ఒక ఇంగ్లీష్ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నిర్మాతగా చిరంజీవి – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ గురించి మాట్లాడాడు. ఇప్పటిదాకా చిరుని మనం లార్జర్ తాన్ లైఫ్ లో చూపిస్తూ వచ్చామని, కానీ ఆయన కేవలం ఫైటర్, డాన్సర్ గా మాత్రమే కాక ఒక కుటుంబ సభ్యుడిగా మనతో కనెక్ట్ అవ్వడం వల్లే అంతగా స్వంతం చేసుకున్నామని, శ్రీకాంత్ మరోసారి ఆ రిలేటబిలిటీని బయటికి తెస్తాడని చెప్పాడు. అంటే సహజత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు కమర్షియల్ అంశాలు ఏవి మిస్ కాకుండా ఒక మెగా అనుభూతిని కలిగించేందుకు నాని, శ్రీకాంత్ సిద్దమవుతున్నారన్న మాట.

ఇదలా ఉంచితే ఈ మెగా మూవీ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ముందు విశ్వంభర పూర్తవ్వాలి. ఆ తర్వాత మెగా 157 ఉండనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది రిలీజయ్యేలోగా బాబీకి మరో ఛాన్స్ ఇవ్వొచ్చని టాక్. ఇంకోవైపు నానితో ది ప్యారడైజ్ చేయబోతున్న శ్రీకాంత్ ఓదెల దాని కోసం మొత్తం ఒక ఏడాది కేటాయించబోతున్నాడు. ఈ లెక్క ప్రకారం చిరంజీవి, ఓదెల ఇద్దరూ చేతులు కలిపేందుకు సంవత్సరంన్నరకు పైగానే పడుతుంది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా ఒక పెద్ద హీరో నటించబోయే ప్యాన్ ఇండియా మూవీగా దీని మీద అప్పుడే ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.