ఒకప్పుడు తెలుగులో భారీ విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్.. గత దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే. కానీ అది కూడా ఫ్లూక్ హిట్ అనిపించేలా తర్వాత తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనతో పని చేయడానికి మిడ్ రేంజ్ తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన వేరే భాషా హీరోల వైపు చూశారు. కొందరు బాలీవుడ్ హీరోలను ట్రై చేసి ఫెయిలైన పూరి.. ఇటీవలే విజయ్ సేతుపతితో సినిమాను ఓకే చేయించుకున్నాడు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
పూరితో కలిసి విజయ్ సేతుపతి దిగిన ఫొటో బయటికి రావడంతో ఈ ప్రాజెక్టు కన్ఫమ్ అయిందని తేలిపోయింది. ఐతే ఈ అప్‌డేట్ బయటికి వచ్చినప్పటి నుంచి తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో గొడవ గొడవ చేస్తున్నారు. గత ఏడాది ‘మహారాజా’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు సేతుపతి. దాని తర్వాత హీరోగా ఓకే చేసిన కొత్త చిత్రం పూరీదే. ఇంత మంచి విజయం దక్కాక పోయి పోయి డిజాస్టర్లలో ఉన్న పూరీతో సినిమా ఏంటి అని వాళ్లు సేతుపతిని ప్రశ్నిస్తున్నారు. కొందరు తమిళ మీడియా వాళ్లు కూడా పూరితో సేతుపతి జట్టు కట్టడంపై ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టి తమిళ అభిమానులను రెచ్చగొడుతున్నారు.
పూరీని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని అయితే పూరి మీద దారుణంగా కామెంట్ చేయగా.. శాంతను భాగ్యరాజ్ అనే నటుడు అతణ్ని మందలిస్తూ రిప్లై ఇచ్చాడు. పూరి లాంటి పెద్ద దర్శకుడి గురించి అలా మాట్లాడొద్దని అతడికి హితవు పలికాడు. దీంతో ఆ వ్యక్తి పోస్టు డెలీట్ చేశాడు. కానీ ఇలా చాలామంది పూరి మీద నెగెటివిటీ చూపిస్తూ.. సేతుపతిని నిలదీస్తూనే ఉన్నారు. వీళ్లందరికీ పూరి తన సినిమాతో బదులు చెబుతారేమో చూడాలి.