పిల్ల జమీందార్ హీరోయిన్ + కేజీఎఫ్ విలన్

ఫిలిం ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి వైపు అడుగులు వేయడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రేమికులిద్దరూ తెలుగు వాళ్లు కాదు కానీ.. తెలుగు సినిమాలతో వారికి టచ్ ఉంది. ఆ జంటనే.. హరిప్రియ, వశిష్ట.సింహా.

కన్నడ అమ్మాయి అయిన హరిప్రియను ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు మరిచిపోయి ఉండొచ్చు కానీ.. ఆమె ఒక దశలో తెలుగులో చెప్పుకోగ్గ సినిమాలే చేసింది. నేచురల్ స్టార్ నాని హిట్ మూవీ ‘పిల్ల జమీందారు’లో ఆమే హీరోయిన్. ఈ చిత్రం ఆమెకు తెలుగులో ఏకైక హిట్. ఇది కాక నందమూరి బాలకృష్ణతో ‘జై సింహా’లోనూ ఆమె కథానాయికగా నటించింది. మరి కొన్ని చిన్న సినిమాల్లోనూ నటించింది. ఇక వశిష్ఠ సింహాకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘కేజీఎఫ్’. అందులో నెగెటివ్ రోల్‌లో అతను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో అతను బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. తెలుగులో అతను ‘ఓదెల రైల్వే స్టేషన్’ సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. హరిప్రియ, వశిష్ఠ కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారట. ఎట్టకేలకు వాళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అనంతరం.. *Us’ అని రెండు అక్షరాలు, లవ్ సింబల్ జోడించి బీచ్‌ దగ్గర దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తాము ఎంగేజ్ అయిన విషయాన్ని వెల్లడించింది హరిప్రియ. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది.

2007లో తుళు అనే కన్నడ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన హరిప్రియ.. తెలుగులోనే కాక, తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ ఆమె తొలి చిత్రం. హరిప్రియ నిశ్చితార్థం గురించి వెల్లడించిన సమయంలోనే తమిళ కథానాయిక ప్రియ భవానీ శంకర్‌ సైతం తనకు కాబోయే వరుడిని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. అతడి పేరు రాజవేలు. కాలేజీ రోజుల్లో అతడితో ప్రేమలో పడ్డ ప్రియ.. సినిమాల్లో కథానాయికగా ఎదిగాక కూడా తనతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తోంది. వీళ్లిద్దరూ కలిసి కొత్త ఇల్లు కట్టుకున్న సందర్బంగా రాజవేలును ప్రియ సోషల్ మీడియాకు పరిచయం చేసింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారు.