బాల‌య్య‌తో మ‌రో అన్‌పాపుల‌ర్ హీరోయిన్

సీనియ‌ర్ హీరోల‌కు ఈ మ‌ధ్య హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. ఇంత‌కుముందులా వ‌య‌సు అంత‌రం చూడ‌కుండా ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను క‌థానాయిక‌లుగా పెట్టే ప‌రిస్థితి లేదు. ఈ త‌రం స్టార్ హీరోయిన్లు మ‌రీ వ‌య‌సు ఎక్కువ ఉన్న హీరోల ప‌క్క‌న చేయ‌డానికి వెనుకంజ వేస్తున్నారు. వాళ్ల డేట్లు కూడా ఖాళీగా ఉండ‌ట్లేద‌న్న సంగ‌తీ తెలిసిందే. దీంతో చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ల స‌ర‌స‌న పేరు లేని హీరోయిన్ల‌నే తీసుకోవాల్సి వ‌స్తోంది. అందులోనూ బాల‌య్య సినిమాల్లో క‌థానాయిక‌ల‌కైతే ఒక రేంజ్ అంటూ ఉండ‌ట్లేదు.

బాల‌య్య చివ‌రి సినిమా అఖండ‌లో క‌థానాయిక‌గా న‌టించిన ప్ర‌గ్యా జైశ్వాల్ ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు వీర‌సింహారెడ్డిలో ఒక క‌థానాయిక‌గా శ్రుతి హాస‌న్ ఓకే కానీ.. మ‌రో హీరోయిన్ హ‌నీ రాజ్ అయితే బాల‌య్య స్థాయికి త‌క్కువే.

ఇక బాల‌య్య న‌టించ‌బోయే కొత్త చిత్రంలో కూడా ఒక అన్‌పాపుల‌ర్ హీరోయినే న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ప్రియాంక జ‌వాల్క‌ర్ అని లేటెస్ట్ న్యూస్. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ఈ నెల‌లోనే సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల బాల‌య్య కూతురిగా కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఇక బాల‌య్య‌కు జోడీగా ప్రియాంక జ‌వాల్క‌ర్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఐతే శ్రీలీలను కూతురిగా పెట్టి ప్రియాంక‌ను త‌ల్లిగా చూపించ‌డం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆమె పాత్ర యంగ్ బాల‌య్య‌కు జోడీగా ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. బ‌హుశా ఈ చిత్రంలో ఇద్ద‌రు బాల‌య్య‌లు క‌నిపించొచ్చు. లేదా ప్రియాంక పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో ఉండొచ్చు. తాజాగా ప్రియాంక‌కు లుక్ టెస్ట్ జ‌రిగింద‌ని, ఆమెనే క‌థానాయిక‌గా ఖ‌రారు చేశార‌ని స‌మాచారం.