మహేష్-రాజమౌళి సినిమాపై ఫన్నీ అప్‌డేట్

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సైతం భారీ విజయాన్నే అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ని మించి ‘ఆర్ఆర్ఆర్’కు అప్రిసియేషన్ వచ్చింది. దీంతో జక్కన్న తర్వాతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తర్వాతి సినిమా మహేష్ బాబుతో అనే విషయం ఎప్పుడో ఫిక్సయింది. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉంది.


మహేష్‌తో ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ చేయబోతున్నట్లుగా జక్కన్న ఆల్రెడీ తనే స్వయంగా సంకేతాలు ఇచ్చాడు. ఆ సినిమా కోసం స్క్రిప్టు పని నడుస్తుండగా.. ‘హిట్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు రాజమౌళి. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. వేదిక ఎక్కి రాజమౌళిని తర్వాతి సినిమా గురించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ సినిమా అప్‌డేట్స్ ఇవ్వమని అడిగింది.

ఐతే సుమ ప్రశ్నల్లో వేటికీ ఇప్పుడే సమాధానం చెప్పలేనంటూ.. మహేష్‌తో తాను చేయబోయే తర్వాతి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యాంకర్ మాత్రం సుమనే అని తేల్చేశాడు రాజమౌళి. దీంతో స్టేడియం ఒక్కసారిగా నవ్వులు పూశాయి. రాజమౌళికి సుమ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళే కాక ఆయన కుటుంబ సభ్యుల సినిమాలన్నింటికీ ఆమెనే యాంకరింగ్ చేస్తుంటుంది. కాబట్టి మహేష్‌తో రాజమౌళి సినిమాకు కూడా ఆటోమేటిగ్గా ఆమె యాంకరింగ్ చేస్తుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు.

ఇక ‘హిట్-2’ గురించి జక్కన్న మాట్లాడుతూ.. ‘హిట్’ను ఒక ఫ్రాంఛైజీగా మార్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. ‘హిట్’ లాగే ‘హిట్-2’ కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని.. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ తీసుకురావడంలో దర్శకుడు శైలేష్ కొలను విజయవంతం అయ్యాడని.. ‘హిట్’ సిరీస్‌లో ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయని.. అన్నీ విజయవంతం అవుతాయని రాజమౌళి అన్నాడు.