రిషబ్ & ప్రదీప్ – ఇద్దరూ ఇద్దరే

స్టార్ క్యాస్టింగ్ లేకుండా దర్శకులే హీరోలుగా నటిస్తూ రెండు పడవల సవారీ చేయడం చాలా కష్టమైన విషయం. ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి భీభత్సమైన ఫామ్ అనుభవిస్తున్న టైంలో కథానాయకుడిగానూ ప్రూవ్ చేసుకుందామని ఉగాది, అభిషేకంలు చేశారు. కానీ ఆడియన్స్ కి నచ్చలేదు. తిరిగి డైరెక్టర్ క్యాప్ పెట్టుకున్నా ఆయన మునుపటి మేజిక్ చేయలేకపోయారు. వివి వినాయక్ ఆ మధ్య శీనయ్య పేరుతో ఓ సినిమా మొదలుపెట్టాక అసలు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. నిర్మాత దిల్ రాజే అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆర్ నారాయణమూర్తిలాంటి వాళ్ళు మాత్రమే ఇలా గెలిచిన సందర్భాలు ఉన్నాయి.

ఇక వర్తమానానికి వస్తే సౌత్ లోనే కాదు ఇండియా వైడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇద్దరి పేర్లు మారుమ్రోగుతున్నాయి. మొదటి పేరు రిషబ్ శెట్టి. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాంతార ఇచ్చిన క్రియేటర్ గా బాలీవుడ్ లోనూ ఈ శాండల్ వుడ్ టాలెంట్ మీద చర్చ జరుగుతోంది. అతనే నటించి ఆవిష్కరించిన అద్భుతమిది. రెండో వ్యక్తి ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడేని కేవలం అయిదు కోట్లతో తీస్తే వరల్డ్ వైడ్ గ్రాస్ వంద కోట్లు దాటడం ఖాయమని చెన్నై మీడియా బల్లగుద్ది చెబుతోంది. లేట్ గా వచ్చినా తెలుగులోనూ రెండు కోట్లకు పైగా బోణీ కొట్టి వామ్మో అనిపించిన బడ్జెట్ వండర్ ఇది.

స్టార్ దర్శకులే ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఈ రిషబ్, ప్రదీప్ లు ఎవరూ ఊహించని కాన్సెప్ట్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ద్వారా రాబోయే రచయితలకు దర్శకులకు రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. ఏళ్ళ తరబడి తీయడం కన్నా కంటెంట్ కరెక్ట్ గా నెలల్లో పూర్తి చేసి ఎలాంటి ఫలితాలు అందుకోవచ్చో నిరూపిస్తున్నారు. కాంతార, లవ్ టుడేలో ఎలాంటి గ్రాఫిక్స్ లేవు. ఖరీదైన ఆర్ట్ వర్క్ వాడలేదు. అవుట్ డోర్, ఇంటీరియర్స్ తో పూర్తి చేశారు. కథా కథనాలతో కట్టి పడేశారు. ఇలాంటి వాళ్ళు మరికొందరు వస్తే ఎన్ని ఓటిటిలు వచ్చినా థియేటర్లకు ఢోకా ఉండదు.