థియేట‌ర్ల‌లో క‌ళ‌క‌ళ.. మ‌ళ్లీ ఈ సినిమాతోనేనా?

డ‌బ్బింగ్ మూవీ కాంతార త‌ర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌ను క‌ళ‌క‌ళ‌లాడించిన సినిమా ఏదీ రాలేదు. ఊర్వ‌శివో రాక్ష‌సివో మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. స‌మంత సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ఓ మోస్త‌రు వ‌సూళ్లు సాధించింది. చిన్న సినిమా మ‌సూద ప‌ర్వాలేద‌నిపించింది.

మొత్తంగా న‌వంబ‌రు బాక్సాఫీస్ అయితే చాలా డ‌ల్లుగానే న‌డిచింది. ఈ వారం వ‌స్తున్న అల్ల‌రి న‌రేష్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం, డ‌బ్బింగ్ సినిమా ల‌వ్ టుడే ఏమాత్రం ప్ర‌భావం చూపుతాయో చూడాలి. వీటికి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో లేవు. దిల్ రాజు అన్న‌ట్లు ల‌వ్ టుడే మూవీ నిజంగా థియేట‌ర్ల‌ను షేక్ చేస్తుందేమో చూడాలి. ఐతే టాలీవుడ్ అయితే న‌వంబ‌రు మీద ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే క‌నిపిస్తోంది.

ఇప్పుడు ట్రేడ్ ఆశ‌ల‌న్నీ డిసెంబ‌రు మీదే ఉన్నాయి. మ‌ళ్లీ బాక్సాఫీస్‌ను క‌ళ‌క‌ళ‌లాడించే తెలుగు సినిమా డిసెంబ‌రు 2న రానున్న హిట్-2నే అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమాకు గ‌త కొన్ని రోజుల్లో హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇంత‌కుముందు రిలీజైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ పెంచితే.. తాజాగా వ‌చ్చి ట్రైల‌ర్ మ‌రింత ఉత్కంఠ రేపింది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనిపించేలా చాలా ఉత్కంఠ‌భ‌రితంగా, ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్ క‌ట్ చేశాడు డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను.

ముఖ్యంగా కోడి బుర్ర డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లుపెట్టి దాంతోనే ముగించ‌డం ట్రైల‌ర్లో హైలైట్ అని చెప్పాలి. స్టార్ హీరోలు న‌టించే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల స్థాయిలో హిట్‌-2కు హైప్ క‌నిపిస్తుండ‌డం విశేషం. తొలి రోజు, తొలి వీకెండ్లో ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవ‌డం గ్యారెంటీలా క‌నిపిస్తోంది.