సమంతా ఇమేజ్ అండ్ బ్రాండ్ మీదే మార్కెటింగ్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా హిట్టు మార్కు కొట్టిన యశోద థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది. పెద్దగా పోటీ లేకపోయినప్పటికీ కేవలం ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ తో మంచి వసూళ్లు రాబట్టుకున్న ఈ మెడికల్ థ్రిల్లర్ త్వరలోనే ఓటిటి ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ టైంలో కోర్టు కేసు రూపంలో ఓ ట్విస్టు వచ్చి పడటం యూనిట్ ని ఖంగారు పెట్టేస్తోంది. సినిమాలో సరోగసి మాఫియా ఇవా అనే హాస్పిటల్ లో జరుగుతున్నట్టు చూపించిన సంగతి చూసిన వాళ్లకు గుర్తే. అదేమీ నిజం ఆసుపత్రి కాకపోయినా ఆర్ట్ వర్క్ తో ఆ సహజత్వం తీసుకొచ్చారు.
కట్ చేస్తే నిజంగానే ఈ పేరుతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ ఉంది. కృత్రిమ గర్భాలతో వ్యాపారం చేస్తామనేలా మా పేరుతో చూపించడం వల్ల పరువు నష్టం కలిగిందని భావిస్తూ ఇవా యాజమాన్యం ఏకంగా కోర్టు కేసు వేసింది. దీంతో డిసెంబర్ 19 తుది తీర్పు ఇచ్చే దాకా ఎలాంటి స్ట్రీమింగ్ ఇతరత్రా ప్రసారాలు జరగడానికి వీల్లేదని సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇంకో పాతిక రోజుల వరకు డిజిటల్ లో వచ్చే ఛాన్స్ లేదన్న మాట. అయితే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దీని గురించి పై కోర్టుకు వెళ్తారా లేక తమ తప్పేమి లేదని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు సమకూరుస్తారా వేచి చూడాలి.
ఒకవేళ వాయిదా తప్పదనుకుంటే ఓటిటి సంస్థ ముందు చేసుకున్న ఒప్పందంలో మొత్తం కొంత తగ్గించే అవకాశం లేకపోలేదు. అయినా స్క్రిప్ట్ రాసుకునే టైంలోనే అసలు ఇవా అనే పేరుతో ఇండియాలో ఎక్కడైనా పేరు పొందిన ఆసుపత్రులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఉంటే ఇప్పుడు అవసరం లేని తలనొప్పి తగ్గేది. గూగుల్ లో కొడితే ఈజీగా తేలిపోయే వ్యవహారాలను చూస్తే గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చిన సామెత గుర్తొస్తుంది. ఇదంతా ఎలా ఉన్నా సామ్ మాత్రం హిట్టు కొట్టిన ఆనందంలో ఉంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సామ్ డిసెంబర్ చివరివారంలోగా ఖుషి సెట్స్ లో అడుగు పెట్టొచ్చని టాక్.