కన్నడిగులను మళ్లీ గిల్లిన రష్మిక

రష్మిక మందన్నా ఒక మామూలు కాలేజీ అమ్మాయి నుంచి కొన్నేళ్లు తిరిగేసరికి ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు తొలి అవకాశం ఇచ్చింది కన్నడ ఫిలిం ఇండస్ట్రీ. ఏదో చిన్న మోడలింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటే దానికి సంబంధించిన ఫొటోలు ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే.. వాటిని చూసి దర్శకుడు రిషబ్ శెట్టి, హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి కలిసి ఆమెకు ‘కిరిక్ పార్టీ’లో ఛాన్స్ ఇవ్వడం.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయి ఆమెను బిజీ హీరోయిన్‌గా మార్చడం.. ఇంతలో తెలుగులో అవకాశాలు రావడంతో ఆమె ఇటు వైపు వచ్చేయడం.. ఆపై తమిళం, హిందీలోనూ అవకాశాలు అందుకుని పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదగడం జరిగింది.

ఐతే కన్నడలో పాపులారిటీ సంపాదించాక కన్నడ ఇండస్ట్రీని రష్మిక పట్టించుకోలేదని, తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చిందని.. కన్నడ సినిమాల గురించి తక్కువగా చూసిందనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఆమెను తరచుగా కన్నడ ఫ్యాన్స్ ఏదో ఒక కారణం చూపించి ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు రష్మిక చేసిన ఒక కామెంట్‌తో వారికి మరింత మండింది.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు తొలి అవకాశం ఎలా వచ్చిందో ఆమె వివరిస్తూ.. తనను ఇంట్రడ్యూస్ చేసిన బేనర్, నిర్మాతల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. సోసో ప్రొడక్షన్ హౌస్ అన్నట్లుగా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి రిషబ్, రక్షిత్‌ల పేర్లే చెప్పకుండా ముందుకెళ్లిపోయింది. ఐతే రిషబ్, రక్షిత్ మామూలు వాళ్లు కాదు. వాళ్ల పేర్లను రష్మిక మరిచిపోయే సీన్ లేదు. ఉద్దేశపూర్వకంగానే వారి పేర్లను ఆమె పరిహరించిందంటూ ఆ వీడియో పెట్టి రష్మికను ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రిషబ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత, సాయిపల్లవి, రష్మిక లాంటి హీరోయిన్లలో ఎవరితో పని చేయడానికి ఇష్టపడతారని అడగ్గా.. అతను కావాలనే రష్మిక పేరు మినహాయించి మాట్లాడిన వీడియో కూడా రష్మిక వీడియోతో పాటు కలిపి ట్రెండ్ అవుతోంది. రష్మిక యాటిట్యూడ్ చూపిస్తే.. రిషబ్ ఆమెకు సరిగ్గానే పంచ్ ఇచ్చాడంటూ ఆమెను మరింతగా ట్రోల్ చేస్తున్నారు కన్నడిగులు.