ఖైదీ 2 కోసం అదిరిపోయే క్యాస్టింగ్

కార్తీ కెరీర్ కి అతి పెద్ద బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో ఖైదీదే మొదటి స్థానం. తెలుగులో మార్కెట్ తగ్గిపోయినప్పుడు తిరిగి తన ఫ్యాన్స్ మొహంలో నవ్వు తెప్పించింది ఈ బ్లాక్ బస్టరే. లోకేష్ కనగరాజ్ అనే డైరెక్టర్ డైమండ్ ని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఇదే. అంతకు ముందు ఇతను మానగరం తీసినప్పటికీ ఖైదీనే డెబ్యూ అనుకునే వాళ్ళు చాలానే ఉన్నారు. దీనికి సీక్వెల్ ని ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టుకున్న లోకేష్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ క్యాస్టింగ్ కు సంబంధించి పక్కా ప్రణాళికతో స్కెచ్ రెడీ చేసుకున్నట్టు చెన్నై మీడియా అప్డేట్. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

దాని ప్రకారం ఇది కమల్ హాసన్ విక్రమ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఖైదీ 2లో మెయిన్ విలన్ గా లారెన్స్ నటించబోతున్నాడు. అది కూడా విజయ్ సేతుపతి చనిపోతాడు కాబట్టి సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర తనని ఆ స్థానంలో అప్పాయింట్ చేస్తాడు. అంటే ఖైదీని విక్రమ్ ని ముడిపెట్టి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని చూపించబోతున్నాడన్న మాట. సూత్రప్రాయంగా లారెన్స్ ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు వినికిడి. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో చేయాల్సిన ప్యాన్ ఇండియా మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదవ్వగానే నెక్స్ట్ టార్గెట్ ఖైదీ 2నే.

రామ్ చరణ్ తో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న లోకేష్ కనగరాజ్ 2024 కంటే ముందు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు. విజయ్ మూవీ, ఖైదీ 2 ఈ రెండూ పూర్తి చేశాక ఒకవేళ కమల్ కనక విక్రమ్ కొనసాగింపు చేయమంటే దానికి కమిట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మూడు సినిమాలను ముడిపెడుతూ కథలు రాసుకుంటున్న లోకేష్ ఒక్క మాస్టర్ ని మాత్రమే విడిగా పెట్టాడు. ఇప్పుడు చేయబోయేది కూడా పూర్తిగా కొత్త కథ. ఒకదానికొకటి సంబంధం లేని డిఫరెంట్ జానర్లు ట్రై చేస్తున్న లోకేష్ క్రియేటివిటీ క్యాస్టింగ్ లోనే ఈ స్థాయిలో ఉంటే అవుట్ ఫుట్లు ఎప్పటిలాగే గొప్పగా వస్తాయి.