ఓ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇవ్వడం.. సమయానికి సినిమా సిద్ధం కాకో, ఇంకేవైనా కారణాలతోనో వాయిదా వేయడం మామూలే. కానీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదనే అనుకుంటున్నారు. పక్కాగా సినిమా విడుదలకు సిద్ధమై ఉంటేనే.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో వదులుతున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అందుకోలేకపోయింది. ఆ చిత్రమే.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. కేరాఫ్ కంచరపాలెం లాంటి గొప్ప చిత్రాన్ని అందించిన వెంకటేష్ మహా రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు నెలన్నర కిందటే ప్రకటించారు. ఆ తర్వాత జులై 15 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందని తెలిపారు.
ఐతే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. ఏ సందడీ కనిపించలేదు. రిలీజ్ గురించి ఊసే లేదు. పోస్టర్లు పడలేదు. ఐతే కారణాలేంటో తెలియదు కానీ.. ఈ సినిమా శుక్రవారం నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ కావట్లేదు. ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ.. సినిమాను ఇప్పుడే రిలీజ్ చేయట్లేదన్నది స్పష్టం. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తేవాలనుకున్నారు. లాక్ డౌన్ మొదలవడానికి ముందే ఫస్ట్ కాపీ దాదాపు రెడీ అయింది. మరి ఇప్పుడు రిలీజ్ వాయిదా పడటానికి కారణాలేంటో తెలియట్లేదు. ఫాహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కి మలయాళంలో మంచి విజయం సాధించి, క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ‘మహేషింటే ప్రతికారం’ చిత్రానికి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ రీమేక్. సత్యదేవ్ ఇక్కడ అతడి పాత్ర పోషించాడు. ‘బాహుబలి’ తర్వాత ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన సినిమా ఇదే కావడం మరో విశేషం. ‘కంచరపాలెం’ నిర్మాత ప్రవీణ పరుచూరి కూడా ఇందులో నిర్మాణ భాగస్వామే..