వీరయ్య పార్టీలో ముఠామేస్త్రి టచ్

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ప్రమోషన్లు షురూ చేశారు. టైటిల్ లాంచ్ టీజర్ తర్వాత పెద్దగా సౌండ్ చేయకుండా ఆగిపోయిన టీమ్ ఫస్ట్ ఆడియో సింగల్ తో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే రేపు బాస్ పార్టీ పాటను విడుదల చేయనుంది. ప్రోమో కూడా వచ్చేసింది. అందులో పెద్ద విశేషమేం లేదు. దేవిశ్రీ ప్రసాద్ బాసొస్తున్నాడు అంటూ నాలుగైదు లైన్లు పాడటం, బ్యాక్ షాట్ నుంచి చిరు బీడీ కాలుస్తూ నడుచుకుంటూ రావడం తప్ప పెద్దగా రివీల్ చేయలేదు. అయితే దీనికి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ లీక్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

అదేంటంటే ఈ బాస్ పార్టీ సాంగ్ లో ఎప్పుడో 1993లో వచ్చిన ముఠామేస్త్రి ఐకానిక్ స్టెప్ ని చిరంజీవి మళ్ళీ వేశారట. చొక్కా తీసి చంకల మధ్య దాన్ని మడిచి పెట్టుకుని స్టయిలిష్ గా నడిచినట్టు చేసే డాన్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇప్పటికీ దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంద్ర, హిట్లర్ తరహాలో ఇదీ ఎవర్ గ్రీన్ మూమెంట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దాన్ని రిపీట్ చేయడమంటే ఫ్యాన్స్ కి ఖచ్చితంగా గూస్ బంప్స్ ఇచ్చేదే అవుతుంది. అప్పట్లో రాజ్ కోటి కంపోజ్ చేసిన ట్యూన్ కి సంబంధం లేకుండా దేవి ఎలాంటి పాట ఇచ్చాడో ఇంకొద్ది గంటల్లో తేలనుంది.

గాడ్ ఫాదర్ మంచి టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా పెద్ద స్కేల్ కు వెళ్ళకపోవడంతో ఇప్పుడు మెగాభిమానుల ఆశలన్నీ ఈ వాల్తేర్ వీరయ్య మీదే ఉన్నాయి. అసలే బాలయ్య వీరసింహారెడ్డితో పోటీ. రెండూ మాస్ మసాలా సినిమాలు. విజయ్ వారసుడు వల్ల థియేటర్ వివాదం సంగతి ఎలా ఉన్నా టాక్ వస్తే చిరు బాలయ్యలదే పైచేయి అవుతుందనడటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దర్శకుడు బాబీ కూడా వింటేజ్ చిరుని చూపిస్తాననే హామీ బలంగా ఇస్తున్నాడు. పైన చెప్పిన స్టెప్పుని రేపు ఓపెన్ చేస్తారా లేక సంక్రాంతి రిలీజ్ దాకా సస్పెన్స్ లో ఉంచుతారా చూడాలి.