చరణ్ చేయబోయేది పెద్ది కథేనా

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టినా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చిన బుచ్చిబాబుకు నిరీక్షణకు తగ్గ ఫలితమే దక్కేలా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన కొత్త సినిమా లాక్ అయినట్టేనని సమాచారం. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ ప్రాధమిక అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. సతీష్ కిలారు అనే కొత్త ప్రొడ్యూసర్ దీంతో డెబ్యూ చేయబోతున్నాడు. మైత్రి మూవీస్ కి సన్నిహితుడు కావడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్న లాజిక్ లో నిజాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం.

ఇదంతా బాగానే ఉంది కానీ బుచ్చిబాబు ఇప్పుడు ఓకే చేయించుకుంది గతంలో తారక్ కు చెప్పిన పెద్ది(ప్రచారంలో తిరిగిన టైటిల్) కథేనా అనే ప్రశ్న మాత్రం సస్పెన్స్ గా మిగిలింది. స్పోర్ట్స్ టచ్ ఉన్న బ్యాక్ డ్రాప్ లో హీరో పాత్రతో డ్యూయల్ రోల్ చేయించేలా బుచ్చిబాబు డిఫరెంట్ గా రాసుకున్నాడని అప్పట్లోనే టాక్ వచ్చింది. కానీ చరణ్ ఇప్పుడు చేస్తున్న శంకర్ మూవీలో ఆల్రెడీ ద్విపాత్రానభినయం చేస్తున్నాడు. సో బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఫోటో సినిమాలు ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి బుచ్చిబాబు ఫ్రెష్ గా వేరే స్క్రిప్ట్ చెప్పి ఉంటాడన్న మాట మెగా కాంపౌండ్ లో వినిపిస్తోంది.

ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న రామ్ చరణ్ అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక శంకర్ తో తిరిగి రానున్నాడు. బుచ్చిబాబుది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాక తేలుతుంది. అటువైపు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే చాలా సమయం త్యాగం చేసి కొరటాల శివ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఆరేడు నెలలు వేచి చూశాడు. దీనికన్నా ముందు అనుకున్న త్రివిక్రమ్ ది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు బుచ్చిబాబుది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఏదైతేనేం కొత్త దర్శకుడికి మళ్ళీ మెగాహీరో దొరికాడు. అది కూడా చరణ్. ఇంకేం బూరెల బుట్టలో పడ్డట్టే.