సంక్రాంతి మరీ ఎక్కువ దూరంలో లేదు. ఇంకో నలభై అయిదు రోజులు దాటేస్తే పండగ ముంగిట్లో ఉంటాం. ఈసారి బాక్సాఫీస్ పోరు చాలా ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో అందరి కళ్ళు చిరంజీవి బాలకృష్ణ క్లాష్ మీదే ఉంది. వీటికి తోడు తమిళ డబ్బింగ్ వారసుడుని నిర్మాత దిల్ రాజు ఆ రెండింటికన్నా భారీ విడుదలకు ప్లాన్ చేయడం, దానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఒక నోట్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈలోగా కృష్ణగారి అకాలమరణంతో ఎవరూ ఏమి మాట్లాడలేని పరిస్థితి. నిన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి కాబట్టి మళ్ళీ టాపిక్ లోకి రావాల్సిందే.
ఇప్పటిదాకా వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు సంబంధించి ఎలాంటి యాక్టివ్ ప్రమోషన్ జరగలేదు. అటు చూస్తే వారసుడు మొదటి ఆడియో సింగల్ రిలీజైపోయి యాభై మిలియన్ల వ్యూస్ దాటేసి ఛార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. కానీ మైత్రి సంస్థ మాత్రం ఇంకా చివరి దశ షూటింగులతో బిజీగా ఉండటంతో అప్డేట్స్ కి కావాల్సిన ప్లానింగ్ మిస్ అవుతోంది. మనం ఎవరినైతే పోటీ అనుకుంటున్నామో ప్రమోషన్ పరంగా వాళ్లే ముందున్నారు. దేవిశ్రీప్రసాద్ బాస్ సాంగ్ ఈ వారంలోనే వస్తుందని వీరయ్య గురించి ఊరించాడు కానీ అది నెక్స్ట్ వీక్ కి వాయిదా పడిందనేది కన్ఫర్మ్.
ఇక వీరసింహారెడ్డి కనీసం మొదటి ఆడియో సింగిల్ ఎప్పుడు ప్లాన్ చేశారో చెప్పలేదు. తమన్ పుట్టినరోజుకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు తప్పించి కానుకగా పాట తాలూకు బిట్ ఏదైనా వదిలి ఉంటే బాగుండేది. వారసుడుకి తమిళనాడులో అజిత్ తునివుతో పోటీ ఉంది కాబట్టి ఇంకొద్ది రోజుల్లో పబ్లిసిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తారు. ప్రొడక్షన్ వైపు నుంచే కాక హీరో విజయ్ తరఫున టీమ్ ఇలాంటి వాటిలో ఆరితేరిపోయింది. కానీ చిరు బాలయ్యలు మాత్రం ఇప్పటిదాకా చిన్న టీజర్లతో సర్దుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిది వేకప్ టైం. త్వరగా మేల్కొని ప్లాన్ చేసుకుని పరుగులు పెట్టాల్సిందే.