ప్రపంచ సినీ చరిత్రలో పాటల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే కావచ్చు. ఇంకెక్కడా సినిమాల్లో పెద్దగా పాటలు కనిపించవు. ఇక్కడ పాటల కోసం కోట్లు ఖర్చు పెట్టడం బయటి దేశాల వారికి విడ్డూరంగా అనిపించవచ్చు. ఇక ఇండియాలో పాటల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, భారీగా ఖర్చు పెట్టించే దర్శకుడు ఎవరంటే మరో మాటల లేకుండా శంకర్ పేరు చెప్పేయొచ్చు. ఆయన సినిమాల్లో పాటల మీద పెట్టే బడ్జెట్‌తో రెండు మూడు చిన్న సినిమాలు తీసేయొచ్చంటే అతిశయోక్తి కాదు.
జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి సినిమాట్లో పాటలను ఎంత భారీగా తీశారో తెలిసిందే. మధ్యలో కొన్ని సినిమాల్లో ఆయనకు పాటల మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లు అనిపించింది. ఐతే రామ్ చరణ్‌తో తీస్తున్న సినిమాలో మళ్లీ సాంగ్స్‌లో శంకర్ మార్కు చూడొచ్చని అంటున్నారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాటల కోసం పదుల కోట్లు ఖర్చవుతున్నట్ల సమాచారం. ఇందులో ఒక్క పాటకే రూ.15 కోట్లు వెచ్చిస్తున్నారట. ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నెల 20 నుంచి రెండు వారాల పాటలు న్యూజిలాండ్‌లో ఈ పాట చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం హీరో హీరోయిన్లు చరణ్, కియారాలతో టీం న్యూజిలాండ్‌కు బయల్దేరుతోంది. అక్కడ భారీ లొకేషన్లలో, వందల మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాట చిత్రీకరించనున్నారట.
ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్‌తో కలిసి శంకర్ ఈ పాటను గ్రాండ్‌గా డిజైన్ చేశాడట. ఒక్క పాట మీద 15 కోట్లంటే అది ఎంత భారీగా ఉంటుందో అంచనా వేయొచ్చు. మరి తెరపై ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 ఆరంభంలో విడుదలయ్యే అవకాశముంది.