సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు!

Krishna
Krishna

టాలీవుడ్ సూపర్ స్టార్, తెలుగు సినిమా పోకడకు ఎన్నో కొత్త గ్రామర్ పాఠాలు నేర్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఘట్టమనేని కృష్ణ గారు శాశ్వత సెలవు తీసుకున్నారు. నిన్న గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరాక పలు ఆందోళనకర పరిణామాలు జరిగినప్పటికీ తిరిగి కోలుకుంటారనే నమ్మకంతో కోట్లాది అభిమానులు పూజాలు చేశారు. కానీ వాళ్ళ ప్రార్ధనలు ఫలించలేదు.

తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు. 1943 మే 31న వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు మొదటి సంతానంగా గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన నట శేఖరుడు ఆ తర్వాత ఆ వంశ ప్రతిష్ఠలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. నటనే ప్రాణంగా సాహసమే ఊపిరిగా ఎందరో నటీనటులకు స్ఫూర్తి పుస్తకంగా నిలిచిన గొప్ప ప్రస్థానం కృష్ణగారిది

తెనాలిలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎన్టీఆర్,అక్కినేనిలను చూసి తాను ఇండస్ట్రీకి రావాలని నిశ్చయించుకున్న కృష్ణ తన కలను 1965లో ఆదుర్తి సుబ్బరావు తీసిన తేనే మనసులతో సాకారం చేసుకున్నారు. మూడో సినిమా గూఢచారి 116లో జేమ్స్ బాండ్ ని టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికే దక్కింది. 1967లో బాపు ఆవిష్కరించిన సాక్షి ద్వారా కృష్ణలోని మరో నటపార్శ్యం ప్రపంచానికి తెలిసొచ్చింది.

అక్కడితో మొదలు మూడు వందలకు పైగా సినిమాలు చేస్తూనే వచ్చినా ఆయన పరుగు ఆగలేదు. ఇప్పుడంటే బాహుబలి గురించి గొప్పగా చెప్పుకుంటాం కానీ అసలు టెక్నాలజీ తక్కువగా ఉన్న రోజుల్లోనే 1986లో 70ఎంఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ తో సింహాసనం తీసిన తీరు నభూతో నభవిష్యత్. ఎన్టీఆర్ చేయాలా వద్దానే మీమాంసలో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజుని చరిత్రలో చిరస్ధాయిగా నిలిచేగా తీయడం కృష్ణగారికే చెల్లింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో రాజకీయప్రవేశం చేసిన కృష్ణ అయిదేళ్లకే ఏలూరు ఎంపిగా ఎన్నికై ప్రజాసేవలోనూ తన ముద్ర వేయగలిగారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్లు అందుకున్న కృష్ణ తన సంతానం రమేష్ బాబు, మహేష్ బాబులతో చేసిన ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం లాంటి ఎన్నో సినిమాలు అభిమానులకు గొప్ప అనుభూతినిచ్చాయి. కెరీర్ మొత్తంలో 110 దర్శకులు కృష్ణ గారితో పని చేయడం గొప్ప విశేషం.

కౌబాయ్ సెన్సేషన్ మోసగాళ్లకు మోసగాడుతో రికార్డులు సాధించినా, తొలి సినిమా స్కోప్ నిర్మించిన ఘనత తనకే దక్కినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే అరుదైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ వెళ్ళింది స్వర్గానికి వెళ్లినా వందల సినిమాల్లో జీవించిన తీరు లేరనే వాస్తవాన్ని గుర్తు చేయగలదా