సినిమా కోసం అంత రిస్క్ అవ‌స‌ర‌మా?

ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను మెప్పించ‌డానికి హీరోలు ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో తెలిసిందే. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు శ‌రీరాకృతి మార్చుకునేందుకు కొంద‌రు హీరోలు ప‌డే క‌ష్టం అలాంటిలాంటిది కాదు. ఇంత‌కుముందులా మామూలు బాడీతో క‌నిపిస్తే ఇప్పుడు ప్రేక్ష‌కులు ఆమోదించే ప‌రిస్థితి లేదు. చాలా ఫిట్‌గా క‌నిపించాలి. కుదిరితే ప్యాక్స్ పెంచాలి. ఇలా టాలీవుడ్ హీరోల్లో సిక్స్ ప్యాక్స్ చేసిన హీరోలు చాలామందే ఉన్నారు. ఐతే ఈ ప్యాక్స్ కోస‌మ‌ని కొంద‌రు హీరోలు హ‌ద్దులు దాటి క‌ష్ట‌ప‌డుతుండ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

తాజాగా యంగ్ హీరో నాగ‌శౌర్య‌.. ప్రేక్ష‌కుల‌కు షాకిచ్చేలా శ‌రీరాకృతిని మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఆసుప‌త్రి పాల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తాను న‌టిస్తున్న ఓ కొత్త సినిమా షూట్ కోస‌మ‌ని నాగ‌శౌర్య యాబ్స్ పెంచే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ట‌. అవి బాగా ఎలివేట్ కావ‌డం కోసం మూడు రోజులుగా నో వాట‌ర్ డైట్ మీద ఉన్నాడ‌ట‌.

మూడు రోజులు మంచినీళ్లు తాగ‌క‌పోవ‌డంతో సోమ‌వారం అత‌ను డీహైడ్రేట్ అయిపోయి క‌ళ్లు తిరిగి సెట్స్‌లో కింద‌ప‌డిపోయాడ‌ట‌. వెంట‌నే అత‌ణ్ని గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అనంత‌రం డిశ్చార్జి చేశారు. ఇప్పుడు నాగ‌శౌర్య‌కు త‌లెత్తింది చిన్న స‌మ‌స్యే కావ‌చ్చు. కానీ బాడీలు పెంచే క్ర‌మంలో మ‌రీ హ‌ద్దులు దాటితే ఏమ‌వుతుందో చెప్ప‌డానికి ఇది ఒక హెచ్చ‌రిక లాంటిదే.

ఈ మ‌ధ్య జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తూ, ప‌రిమితికి మించి బ‌రువులు మోస్తూ కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయిన వారి ఉదంతాలు త‌ర‌చుగా వింటున్నాం. ఇటీవ‌లే ఒక హిందీ సీరియ‌ల్ న‌టుడు కూడా అలాగే ప్రాణాలు వ‌దిలాడు. అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ అన‌డానికి ఇదొక రుజువు. కాబ‌ట్టి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని హీరోలు ప‌రిమితికి మించి క‌ష్ట‌ప‌డ‌డం మంచిది కాదు.