వెంకటేష్ స్పీడెందుకు తగ్గించినట్టు

Hero Venkatesh Slow Down In Accepting Movies
Hero Venkatesh

ఎఫ్3 అంత పెద్ద హిట్టయినా విక్టరీ వెంకటేష్ ఇప్పటిదాకా కొత్త సినిమా సంతకం చేయలేదు. ఓరి దేవుడాలో కేవలం కొన్ని నిముషాలు అందులోనూ సింగిల్ లొకేషన్ లో జరిగే పాత్ర కాబట్టి ఒప్పుకున్న వెంకీకి దాని వల్ల గొప్ప ఫలితమేమీ దక్కలేదు. అబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోవడంతో దాన్ని అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ తో కిసీకా భాయ్ కిసీకా జాన్ లో హీరోయిన్ పూజా హెగ్డేకు అన్నయ్యగా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నా అది కండల వీరుడి మూవీ కాబట్టి దాన్నుంచి సైతం తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆశించడానికి ఉండదు. ఇది మినహాయిస్తే చేతిలో ఇంకేం లేవు.

Venkatesh in Ori Devuda
Venkatesh in Ori Devuda

దర్శకుడు తరుణ్ భాస్కర్ తో ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్టు అలా అలా పెండింగ్ లో ఉండిపోయి చివరికి పక్కకు తప్పుకుంది. అతను కీడా కోలా అనే కొత్త సబ్జెక్టుతో వేరే క్యాస్టింగ్ ని పెట్టుకుని షూటింగ్ మొదలుపెట్టేసుకున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ ఆ మధ్య ఒక కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. కానీ ప్రిన్స్ లో శివ కార్తికేయన్ ని హ్యాండిల్ చేసిన తీరు, పండని కామెడీతో కేవలం పంచులు మీద ఆధారపడిన వైనం కనీసం ఒరిజినల్ తమిళ వెర్షన్ లోనూ హిట్టివ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో అనుదీప్ స్క్రిప్ట్ ని మరోసారి వడపోతే చేశాక ఫైనల్ చేయాల్సి ఉంటుంది.

Venkatesh In Rana Naidu Netflix Webseries
Venkatesh In Rana Naidu Netflix Webseries

ఇవన్నీ పక్కనపెట్టేసి వెంకటేష్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారని ఇన్ సైడ్ టాక్. అది ఆధ్యాత్మికంగానా లేక విదేశాలకు వెళ్లి రిలాక్స్ అవుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అబ్బాయి రానాతో కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ లో ఉంటుందో చెప్పడం లేదు. ఇది వెంకీకి నారప్ప, దృశ్యం 2ల తర్వాత మూడో ఓటిటి కంటెంట్. చిరంజీవి బాలకృష్ణలు వేగంగా సినిమాలు చేస్తున్న టైంలో వెంకీ, నాగ్ లు మాత్రమే నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తున్నారు.