యశోద.. పర్ఫెక్ట్ టైమింగ్

ఏదైనా సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు టైమింగ్ చాలా కీలకం. పోటీలో ఎవరున్నారు ఎవరు లేరనేది చెక్ చేసుకుని రంగంలోకి దిగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలా కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో గుడ్డిగా క్లాష్ కు తలపెడితే ఏమవుతుందో స్వాతి ముత్యం లాంటి పాజిటివ్ టాక్ వచ్చిన మూవీ కిల్ అయినప్పుడు అందరికీ అర్థమయ్యింది. ఇప్పుడు యశోద ఎలా చేయాలనే దానికి చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.

భీభత్సమైన బ్లాక్ బస్టర్ టాక్ రాలేకపోయినా బాగానే ఉందనే మాట అనిపించుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ రెండు రోజులకే ఆరు కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం చిన్న విషయం కాదు. ఇక్కడ కొన్ని అంశాలు కీలకంగా పని చేశాయి. బాక్సాఫీస్ గత నెల దీపావళి నుంచి బాగా డల్ గా ఉంది. అదే పనిగా థియేటర్ కెళ్ళి చూద్దామనే రేంజ్ లో పెద్దగా సినిమాలేం రాలేదు. ఓరి దేవుడా ఎబోవ్ యావరేజ్ తో సర్దుకోగా కాంతార ఒకటే స్ట్రాంగ్ గా నిలబడి ట్రూ సూపర్ హిట్ అనిపించుకుంది.

ఆ తర్వాత అక్టోబర్ చివరి వారం అనాథలా వదిలేస్తే నవంబర్ ఫస్ట్ వీక్ వచ్చిన ఊర్వశివో రాక్షసివోకి కామెడీ అండ్ యూత్ పరంగా సపోర్ట్ దక్కించుకున్నా జనాన్ని అల్లు శిరీష్ థియేటర్ల వరకు రప్పించలేకపోయాడు. సో ఈ స్లంప్ ఆడియన్స్ ని రెండు మూడు వారాలు హాళ్లకు దూరం చేసింది. ఇప్పుడు యశోద వచ్చింది. సమంతాకు కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్, తన అనారోగ్యం గురించి ఆవేదన చెందుతూ మంచి సినిమాను ఆదరించాలని ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ఇవన్నీ యశోదకు ప్లస్ అవుతున్నాయి.

అసలు కాంపిటీషనే లేకపోవడం వల్ల బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్ తప్ప పబ్లిక్ కి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. దీని వల్లే శని ఆదివారాలు అడ్వాన్స్ బుకింగ్సే యాభై శాతానికి పైగా జరిగాయి. షో టైంకి కరెంట్ బుకింగ్ తో కలిపి ఫుల్స్ పడిపోతున్నాయి. కాకపోతే ఈ స్పీడ్ ని సోమవారం నుంచి కంటిన్యూ చేయడం యశోదకు కీలకం. వీక్ డేస్ లో మరీ ఎక్కువ గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటే చాలు.