RRR 2 నిజంగా జరిగే పనేనా?

ఎడతెరపి లేకుండా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చేదాకా తగ్గేదేలే అన్నట్టు ప్రమోషన్లు చేసుకుంటూ, ప్రీమియర్లు వేసిన ప్రతి చోట హాజరవుతున్న రాజమౌళి వాటిలో భాగంగా షో అయ్యాక అక్కడి మీడియా, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ చాలా విషయాలే చెబుతున్నారు. చికాగోలో మాట్లాడుతూ ట్రిపులార్ కి సీక్వెల్ ఉంటుందని ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు.

ఇదొక్కటే కాదు బాహుబలి 3 కూడా ప్రతిపాదనలో ఉందట. ఇవి అమెరికా జనానికి థ్రిల్లింగ్ న్యూస్ గా అనిపిస్తాయేమో కానీ వాస్తవిక కోణంలో చూస్తే ఇదసలు జరిగే పనేనా అనిపిస్తుంది. అదెలాగో చూద్దాం. జక్కన్న నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే గ్లోబల్ మూవీ ఇంకా మొదలుకానే కాదు. అసలు స్క్రిప్ట్ ఫైనల్ చేస్తేగా. ఎంతలేదన్నా త్రివిక్రమ్ ది పూర్తయ్యేలోపు 2023 వేసవి దాటేస్తుంది. అప్పటికి రాజమౌళి బౌండెడ్ వెర్షన్ తో రెడీగా ఉంటారా లేదో చెప్పలేం.

పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే ఈ ఇండియన్ స్పిల్ బర్గ్ ఆ సమయానికి మరికొంత టైం అడిగినా ఆశ్చర్యం లేదు. సరే వచ్చే ఏడాది ఏదో నెలలో స్టార్ట్ చేస్తారనుకున్నా 2025 కంటే ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. అది కూడా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటేనే సుమా. లేదా ఇంకో సంవత్సరం వెయిటింగ్ తప్పదు.

తర్వాత ఆర్ఆర్ఆర్ ఉంటుందనుకున్నా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఒప్పించి వాళ్ళ డేట్లు తీసుకుని మళ్ళీ సెటప్ చేయడానికి ఏ కాలం పడుతుందో ఎవరూ ఊహించలేం. ఇదంతా జరిగి ఆ సీక్వెల్ వచ్చే లోపు 2030 వచ్చినా ఆశ్చర్యం లేదు. అప్పటికి అమెరికన్లకే కాదు టాలీవుడ్ మూవీ లవర్స్ కి సైతం దాని మీద ఎగ్జైట్ మెంట్ తగ్గిపోయి ఉంటుంది. అవతార్ 2ని ఉదాహరణ చెబుతారేమో కానీ ఆ రేంజ్ హైప్ తో ఆర్ఆర్ఆర్ ని పోల్చలేం. దీనికే ఇన్ని చిక్కుముడులు ఉంటే బాహుబలి 3 అనేది కలలో మాటే. మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సబ్జెక్ట్ ఎక్కడిదాకో వచ్చిందోననే టెన్షన్ లో ఉన్నారు.