త్రిషా.. అంత బిల్డప్ ఏల?

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన తమిళ భామ త్రిష. 2000 ప్రాంతంలో కుర్రాళ్లు ఆమె కోసం పిచ్చెక్కిపోయారు. ఆ టైంలో తెలుగులోనూ నంబర్ వన్ హీరోయిన్ రేంజికి వెళ్లింది త్రిష. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆమె హవా సాగింది. కానీ ఉన్నట్లుండి ఆమె డౌన్ అయిపోయింది. ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. ఒక దశలో తమిళంలో కూడా ఆమె జోరు తగ్గింది. ఇక ఆమె కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో మళ్లీ ఈ మధ్య కొన్ని మంచి అవకాశాలు దక్కుతున్నాయి.

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో కీలక పాత్రతో ఆమె మెరిసింది. ఐతే ఈ చిత్రానికి తెలుగులో మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. కాగా ఇప్పుడు త్రిష నటించిన పాత సినిమా ‘వర్షం’ రీరిలీజ్ అయింది. ప్రభాస్ 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు స్పెషల్ షోలు వేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

పరిమిత సంఖ్యలోనే షోలు వేయగా.. వాటిలో కొన్ని మాత్రమే ఫుల్ అయ్యాయి. ఒక షో సందర్భంగా అభిమానుల సందడికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతుంటే త్రిష దాన్ని షేర్ చేసింది. 18 ఏళ్ల తర్వాత మళ్లీ తన సినిమాకు ఇంత రెస్పాన్స్ వస్తుండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ ప్రేమ వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ అభిమానులను కొనియాడింది.

కానీ ‘వర్షం’ సినిమా రీరిలీజ్ ప్లాన్ చేసింది, థియేటర్లలో సందడి చేస్తున్నది ప్రభాస్ అభిమానులు కదా? అలాంటపుడు ప్రభాస్ గురించి, చిత్ర బృందం గురించి రెండు ముక్కలు మాట్లాడితే ఏం పోయింది? త్రిష ఆ పనే చేయలేదు. అయినా ఈ షోలు ప్లాన్ చేసింది, రచ్చ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తన ఫ్యాన్స్ ఏదో ఇదంతా చేసినట్లు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఏంటి.. అంత పెద్ద హీరోగా మారిన ప్రభాస్ గురించి ఒక్క మాట్లాడకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఆమెను తప్పుబడుతున్నారు.