చైతూ, నాగ్‌లపై సమంత పైచేయి

అక్కినేని లెగసీ కొంత కాలంగా ప్రమాదంలో ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఉంటూ భారీ విజయాలు అందుకున్న అక్కినేని నాగార్జున.. కొన్నేళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసర్ తో దెబ్బ తిన్న బాక్సాపీస్ స్టామినా మళ్లీ బలం పుంజుకోవట్లేదు. టాక్‌తో సంబంధం లేకుండా నాగ్ సినిమాలకు పేలవమైన వసూళ్లు వస్తున్నాయి.

గత ఏడాది వైల్డ్ డాగ్ తో, ఈ ఏడాది ది ఘోస్ట్‌ తో నాగ్ చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. మరోవైపు నాగ్ తనయులు నాగచైతన్య, అఖిల్‌ల పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఒక టైంలో వరుస విజయాలు అందుకున్నా.. ఈ మధ్య చైతూకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. చైతూ చివరి సినిమా ‘థాంక్యూ’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు.

ఇక అఖిల్ మూడు వరుస డిజాస్టర్ల తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పర్వాలేదనిపించుకునే సక్సెస్ అందుకున్నాడు. కానీ అందులో అతడి క్రెడిట్ తక్కువే. నాగ్, ఆయన కొడుకుల పరిస్థితి ఇలా ఉండగా ఆ ఇంటి మాజీ కోడలు సమంత బాక్సాఫీస్ దగ్గర వారిపై పైచేయి సాధిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకుముందు సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఓ బేబీ’ నాగ్ అండ్ సన్స్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు ‘యశోద’ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. ఈ సినిమాకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి రోజు దాదాపు మూడు లక్షల గ్రాస్ వచ్చింది. కానీ దసరా టైంలో రిలీజైన నాగ్ భారీ సినిమా ‘ది ఘోస్ట్’ తొలి రోజు ఇదే సెంటర్లో 2.35 లక్షలు మాత్రమే రాబట్టింది. దానికి తొలి రోజే హౌస్ ఫుల్స్ పడలేదు. అంతకుముందు చైతూ సినిమా ‘థాంక్యూ’కు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.

ఆ చిత్రం ‘ది ఘోస్ట్’తో పోలిస్తే కొంచెం మెరుగ్గా రూ.2.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ సినిమాకు కూడా తొలి రోజు ఫుల్స్ కరవయ్యాయి. సామ్ సినిమా మాత్రం దాదాపు హౌస్‌ ఫుల్స్‌తో రన్ అయింది తొలి రోజు. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ సినిమా మెరుగైన వసూళ్లు సాధించింది. తొలి రోజు ఊపును కొనసాగిస్తే.. థాంక్యూ, ది ఘోస్ట్ -ఓవరాల్ వసూళ్లను కూడా ఇది అధిగమించడం పక్కా. అది అక్కినేని వారి ప్రతిష్టకు గట్టి దెబ్బ అనడంలో సందేహం లేదు.