వర్షం రీ రిలీజ్.. అత్యాశ ఫలితమిది

ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. హద్దులు దాటిందా వెగటొచ్చి వద్దు బాబోయ్ అనిపిస్తుంది. స్పెషల్ షోల ప్రహసనం క్రమంగా దాని అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానికి మరో నిదర్శనంగా వర్షం రీ రిలీజ్ కనిపిస్తోంది. నిన్న ప్రభాస్ ఈశ్వర్ 20వ యానివర్సరీ. ఈ సందర్భంగా డార్లింగ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన వర్షం ని భారీ ఎత్తున పునఃవిడుదల చేశారు. ఇంకేముంది జల్సా, పోకిరి రేంజ్ లో రికార్డులు తిరగరాస్తుందని అందరూ ఆశించారు.

కానీ జరిగింది వేరు. గ్రౌండ్ లెవెల్ లో స్పందన చూస్తే ఫ్యాన్స్ కే దీని మీద అంత ఆసక్తి లేదని తేటతెల్లమయ్యింది. హైదరాబాద్ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ పడటం తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా ఆ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ రిపోర్ట్. కొన్ని జిల్లా కేంద్రాల్లో మరీ అన్యాయంగా షోలు క్యాన్సిల్ కాగా మరికొన్ని చోట్ల సెకండ్ షోలకు పట్టుమని ఓ పాతిక మంది కూడా కనిపించని పరిస్థితి.

దీంతో రెండు మూడు రోజులు రన్ చేయాలనుకున్న బయ్యర్లకు షాక్ తగిలింది. రెండు దశాబ్దాల మైలురాయి కాబట్టి అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారనే అంచనాలు మొత్తంగా తప్పయ్యాయి. రీమాస్టర్ చేసిన ప్రింట్ మీద ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా లాభం లేకపోయింది. దీనికి కారణం లేకపోలేదు. గత నెల ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని రెబెల్, బిల్లాలు వరసగా స్పెషల్ షోలు వేశారు.

వాటిని చూసిన జ్ఞాపకాలు ఇంకా మైండ్ లో ఫ్రెష్ గానే ఉన్నాయి. అలాంటిది వారాలు తిరక్కుండానే మళ్ళీ వర్షం అంటూ వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. పైగా ఏ మాత్రం తగ్గించని టికెట్ రేట్లతో ఆన్ లైన్ లో ఫ్రీగా దొరికే సినిమాలు చూడమంటే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు. మొదట్లో చారిటీ అనేవాళ్ళు కానీ ఇప్పుడిది పూర్తిగా బిజినెస్ మోడల్ లోకి వెళ్ళిపోయింది. ఏదో కొత్త మూవీ రిలీజ్ అవుతున్న రేంజ్ లో వీటికి కూడా లాభాలు కోరుకుంటున్న కొందరు డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ ఫలితమిది.